సేవా దృక్పథంతో పనిచేయాలి
పారా లీగల్ వలంటీర్ల శిక్షణలో జిల్లా జడ్జి సోమశేఖర్
భీమవరం: పారా లీగల్ వలంటీర్లు మండల న్యాయ సేవా సంస్థకు, సామాన్య ప్రజలకు మధ్య వారధి లాంటివారని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఎంఏ సోమశేఖర్ అన్నారు. ఉచిత సేవలందించడానికి మండల న్యాయసేవా సంస్థలో దరఖాస్తు చేసుకున్న పారా లీగల్ వలంటీర్లకు భీమవరంలో గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వలంటీర్లు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని అవసరమైన వారికి సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేయాలన్నారు. వలంటీర్లు వారి ప్రాంతాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయడంలో సహకరించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయాలన్నారు. వలంటీర్లు ధనాపేక్ష లేకుండా సంస్థకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాది కాలపరిమితితో ఇచ్చే గుర్తింపు కార్డులను సక్రమంగా వినియోగించాలని, దుర్వినియోగం చేసినట్టు సంస్థ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సోమశేఖర్ హెచ్చరించారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి సురేష్‌బాబు, ప్యానల్ న్యాయవాదులు బి.సురేష్‌కుమార్, బి.సునీల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment