పట్టపగలే చొరబడ్డారు
గత ఏడాది జిల్లాలో పట్టపగలే చోరీలు ఎక్కువగా జరిగాయి. ఒంటరి మహిళలు, తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దుండగులుదొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తంగా 695 దొంగతనాలు జరగ్గా 350 కేసులను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సుమారు రూ.3 కోట్ల సొమ్మును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కేసుల ఛేదనలో సీసీ పుటేజీలు కీలకంగా మారాయి.
సాక్షి, భీమవరం: గత ఏడాది జిల్లాలో 695 దొంగతనాలు జరిగాయి. వీటిలో 14 వరకు దోపిడీ కేసులు ఉంటే రెండు డెకాయిట్ కేసులు, కన్నపు నేరాలు 206, దొంగతనాలు 473 కేసులు ఉన్నాయి. రెండు కేసుల్లో ఇరువురు మహిళలు హత్యకు గురయ్యారు. మొత్తం రూ.6,78,44,821 సొత్తును దుండగులు అపహరించారు. ఒంటరి మహిళలు, తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగతనాలు ఎక్కువగా జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు ముందుగా రెక్కీ నిర్వహించడం ద్వారా ఆయా ఇళ్లలో చాలావరకు పట్టపగలే చోరీలకు పాల్పడ్డారు. మహిళల మెడ నుంచి గొలుసులు అపహరించే చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. మోటారు సైకిళ్ల దొంగతనాలు, మోటారు సైకిళ్ల డిక్కీలు, కార్లలో ఉంచిన నగదు, బంగారం చోరీలు ఉన్నాయి. ఇక సైబర్ నేరగాళ్లు విజృంభించి అనేక మంది బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములు మాయం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రముఖ వైద్యుడిని బురిడి కొట్టించి రూ.70 లక్షలు కాజేయడం భీమవరంలో సంచలనం సృష్టించింది.
350 కేసులను ఛేదించిన పోలీసులు : సంఘటన స్థలం నుంచి క్లూస్‌టీంలు సేకరించిన వేలిముద్రలు, ఆధారాలు, పోలీస్ జాగిలాల ద్వారా సేకరించిన ఆధారాలు, సీసీ పుటేజీల పరిశీలన, నేరం జరిగిన తీరును బట్టి ఆ తరహాలో నేరాలకు పాల్పడే పాత నేరస్తులను గుర్తించడం, తదితర కోణాల్లో 350 కేసులను జిల్లా పోలీస్ యంత్రాంగం ఛేదించింది. రూ.3,05,61,807 సొమ్మును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. మునుపటి ఏడాదితో పోలిస్తే గత ఏడాది కేసుల సంఖ్య తగ్గడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన కేసుల పరిష్కారం, పురోగతి ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. చోరీ ఘటనల్లో 45 శాతం సొత్తును బాధితులకు అప్పగించినట్టు తెలిపారు. సీసీ పుటేజీల ద్వారా ఆధారాలు లభ్యమైన కేసుల్లో పురోగతి వేగంగా ఉంటే అవి లేని చోట ఆలస్యమవుతున్నట్టు గుర్తించారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా స్థానికులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించగలిగాం
సమర్థవంతమైన పోలీసింగ్, సమష్టి కృషితో మునుపటి కంటే గతేడాది నేరాల సంఖ్యను తగ్గించగలిగాం. చాలా కేసులను తక్కువ వ్యవధిలోనే ఛేదించడం ద్వారా నిందితులను అరెస్టు చేశాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపాం. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలు గూర్చి అవగాహన కల్పించాం. మహిళలు, చిన్నారుల భద్రత కోసం మహిళ రక్షక్ టీమ్స్ ఏర్పాటుచేశాం.
– అద్నాన్ నయీం అస్మి, ఎస్పీ, పశ్చిమగోదావరి జిల్లా
29 జూలై 2024: పాలకొల్లు పట్టణ నడిబొడ్డున బొండాడ వారి వీధిలో నివసిస్తున్న వృద్ధురాలు కలిశెట్టి అనుసూయ ఇంటిలోకి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఆమైపె అత్యాచార యత్నానికి ఒడిగట్టి తలపై రాయితో దాడిచేశారు. ఇంటిలోని ఎనిమిది కాసుల బంగారు వస్తువులను చోరీచేశారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తీవ్రగాయాలతో నెలరోజుల పాటు ఆమె ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి తనువు చాలించింది.
5 సెప్టెంబరు 2024: తాడేపల్లిగూడెం పట్టణం 4వ వార్డులోని ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న బొబ్బిలి దేవి (50)ని హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం గొలుసు, ఉంగరాలు, ఇంటిలోని నగదును ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తక్కువ వ్యవధిలోనే ఘాతుకా నికి పాల్పడిన నిందితున్ని అరెస్టు చేశారు.
23 నవంబరు 2024: భీమవరంలోని ఒక ఇంటిలో భారీ చోరీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్న దోపిడీ దొంగల ముఠాను భీమవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 12 మంది ముఠా సభ్యుల్లో ముగ్గురు పరారవ్వగా, తొమ్మిది మందిని అరెస్టుచేసి వారి వద్ద నుంచి ఇనుపరాడ్లు, కత్తులు, తాళ్లను స్వాధీనం చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది.
16 డిసెంబరు 2024: తాడేపల్లిగూడెంలో దంపతులు బంగారం, వెండి హోల్‌సేల్ వ్యాపారం పేరుతో జిల్లాలో 33 మంది వ్యాపారులను మోసగించి రూ.85 లక్షలు విలువచేసే ఆరు కేజీల బంగారం, 106 కేజీల వెండి వస్తువులను కాజేసీ పరారవ్వడం సంచలనమైంది. నిందితుల కాల్‌డేటా ఆధారంగా పోలీసులు వారు ఉన్న లొకేషన్‌ను గుర్తించి అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది జిల్లాలో 695 చోరీలు
రెండు ఘటనల్లో ఇద్దరు మహిళల హత్య
రూ.6.78 కోట్ల సొత్తు అపహరణ
పాలకొల్లు, తాడేపల్లిగూడెంలలో సంచలనం కలిగించిన చోరీలు
భీమవరంలో బందిపోటు దోపిడీ యత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment