ఓవైపు పరీక్షలు.. మరోవైపు సినిమా షూటింగ్
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో దాసరి నారాయణరావు (డీఎన్నార్) ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓ వైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూనే.. మరో వైపు సినిమా చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలు డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డీఎన్నార్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి. కానీ అదే సమయంలో పేరు పెట్టని ఓ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలు రాయడం మానేసి షూటింగ్ వైపు చూస్తూ ఉండిపోవడం గుర్తించామని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎలా అనుమతి ఇస్తారంటూ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా అని అధ్యాపకులు, కమిటీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం
డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు గత నెల డిసెంబర్ 28న ప్రారంభంకాగా ఈనెల 9వ తేదీ వరకు జరగనున్నాయి. సబ్జెక్ట్‌ల వారీగా జరిగే పరీక్షలకు మూడు గంటల సమయం, స్కిల్ పరీక్షలకు రెండు గంటలు సమయం ఇస్తారు. శనివారం స్కిల్ పరీక్ష కావడంతో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రశ్నపత్రం 2.40 గంటలకు ఇచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. తమకు 1.45 గంటలకు ప్రశ్నపత్రం ఆన్‌లైన్‌లో వస్తుందని కళాశాలకు చెందిన ఓ అధ్యాపకుడు తెలిపారు. తమ కళాశాలలో సుమారు 200 మంది వరకు విద్యార్థులు ఉన్నారని, వారందరికీ నాలుగు పేజీల ప్రశ్నపత్రం ప్రింట్ తీసి ఇచ్చేసరికి ఇంత ఆలస్యమైందని ఆయన చెప్పారు. ఎంత ఆలస్యమైందో అంత సమయం కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్న పత్రం
Comments
Please login to add a commentAdd a comment