ప్రతి విద్యార్థీ గొప్ప ఆవిష్కర్త కావాలి
తాడేపల్లిగూడెం: ప్రతి విద్యార్థి గొప్ప ఆవిష్కర్తగా తయారు కావాలని ఏపీ నిట్ డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డాక్టర్ వి.సందీప్ సూచించారు. నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ ఎన్‌వీ రమణారావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్డర్ పి.దినేష్ శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయం, పెంటపాడులోని ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాలల నుంచి మొత్తం 180 మంది విద్యార్థులు శనివారం నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియం, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వర్క్‌షాపులను పరిశీలించారు. యంత్రాల పనితీరు, వాటి ప్రాధాన్యతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి పరిశోధకుడిగా రాణించాలంటే పాఠశాల విద్య నుంచే సరైన పునాది ఉండాలని చెప్పారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.విజయ్, ప్రేమలత, మనీషా, లక్ష్మీనారాయణ, ప్రసాద్, దిలీప్, సాయి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు టాలీ అనిత
ఏలూరు రూరల్: గుజరాత్ రాష్ట్రం భగ్జవర్‌లో జరిగే జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ పోటీలకు ఏలూరు క్రీడాకారిణి ఏ టాలీ అనిత ఎంపికై ంది. ఈ నెల 5వ తేదీ నుంచి 12 వరకూ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. గత నెల మార్టేరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ చాటి రాష్ట్ర జట్టులో చోటు సాధించింది. ఫలితంగా జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి కె మురళీకృష్ణ చెప్పారు.
లక్ష్మణేశ్వరంలో యువతి ఆత్మహత్య
నరసాపురం రూరల్: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం ప్రగతి నగర్‌కు చెందిన టంకాని లక్ష్మీకుమారి (20) శనివారం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పక్క గదిలో నిద్రిస్తున్న లక్ష్మీకుమారి చెల్లెలు దుర్గా భవాని విషయాన్ని కుటుంబ సభ్యులకు, స్థానికులకు తెలియజేసింది. దీంతో లక్ష్మీకుమారిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి సింహాచలం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment