మహిళల కోసం వినూత్న ప్రాజెక్టులు చేపట్టాలి
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని వివిధ వర్గాల మహిళల మెరుగైన జీవనోపాధికి వినూత్న ప్రాజెక్టులు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టరేట్‌లో మహిళల ఉపాధికి అవసరమైన ప్రాజెక్టులపై గ్రామీణ్ ఫౌండేషన్ ప్రతినిధులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విభిన్న వర్గాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రాజెక్టులు అమలు చేయడంతో పాటు, అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. వర్మీ కంపోస్ట్ ఎగుమతులకు అవసరమైన సాయాన్ని అందించడం, డ్రోన్ల నిర్వహణపై శిక్షణ తదితర ప్రాజెక్టుల రూపకల్పనకు ఆలోచన చేసి అమలుకు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా ఉందని చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మార్చి జపాన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలకు అనుగుణంగా ఎగుమతులకు ప్రోత్సాహం అందించాలన్నారు. గ్రామీణ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం డైరెక్టర్ అరిందం దాస్ గుప్తా మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ, కృష్ణ, విశాఖపట్నం జిల్లాలలో సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో గ్రోద్రెజ్ ప్రాజెక్టు చేపట్టామన్నారు. మూడు నెలల కాలవ్యవధిలో 5 వేల మంది మహిళా రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దగా మరో 10 లక్షల మంది చిన్న, సన్న కారు రైతులకు సహాయం చేసేలా ప్రోత్సహించామన్నారు. పశ్చిమగోదావరిలోని యానాది, ఎరుకల జీవనోపాధి మెరుగుదల కోసం ముసాయిదా ప్రతిపాదనను తయారు చేసి కలెక్టర్‌కు వివరించారు. గోద్రెజ్ ప్రాజెక్ట్ కోసం 10 మండలాలు ఎంపిక చేశామని, మూడు నెలల పైలట్ ప్రాజెక్టుగా జనవరి 15 నుంచి చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment