211 మంది ఎంపిక
ఏలూరు టౌన్: ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. గురువారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మూడవరోజు దేహదారుఢ్య పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఉదయం నుంచీ గ్రౌండ్స్‌లోనే ఉంటూ పోటీలను పర్యవేక్షించారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఎంపికలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 600 మంది పురుష అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేయగా 346 మంది మాత్రమే హాజరయ్యారని, వారిలో 211 మంది ఎంపికై నట్లు ఎస్పీ శివకిషోర్ చెప్పారు. అభ్యర్థులు ఎంపిక పోటీలకు హాజరయ్యే సమయంలో తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోటీ పరీక్షల నిర్వహణలో ఉన్నారు.
సార్వత్రిక విద్యాపీఠం ఫీజు చెల్లింపునకు గడువు పెంపు
భీమవరం: రాష్ట్ర సార్వత్రిక విద్యా పీఠానికి సంబంధించి టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష రుసుం చెల్లించడానికి గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 6వ తేదీ వరకు అవకాశముందన్నారు. ఒక్క సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో 8వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో 9వ తేదీ వరకు, తత్కాల్ రుసుంతో 10వ తేదీ వరకు అవకాశముందని నారాయణ తెలిపారు.
కానిస్టేబుళ్ల భర్తీకి చర్యలు
ఆకివీడు: కొత్తగా ఆరు వేల కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆకివీడు మండలంలోని అజ్జమూరు గరువులో కొత్తగా నిర్మించిన పోలీస్ సర్కిల్ కార్యాలయ భవనాన్ని గురువారం ఆయన డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజుతో కలిసి ప్రారంభించారు. ఐజీ మాట్లాడుతూ పోలీసులు తక్కువగా ఉన్న స్టేషన్లలో కానిస్టేబుళ్లను నియమిస్తామని చెప్పారు. యండగండిలో పార్శిల్‌లో శవం కేసును తమ పోలీసులు చాకచక్యంగా ఛేదించారన్నారు. ఈ సందర్భంగా ఎస్సైలకు, సీఐలకు ప్రత్యేక మొమెంటోలను అందజేశారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు ఇచ్చిన రూ. కోటి సహాయంతో నియోజకవర్గంలోని నాలుగు పోలీస్‌స్టేషన్‌లకు వాహనాల్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం, ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ స్వచ్ఛంద పదవీ విరమణ
భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ మహేశ్వరరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన మరో ఏడేళ్ల సర్వీసు ఉండగానే వాలంటరీ రిటైర్మ్‌ంట్ ప్రకటించారు. వ్యక్తగత కారణాల వల్ల ముందస్తుగా రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు ఆయన చెబుతున్నప్పటకీ పని ఒత్తిడే కారణమని తెలుస్తోంది. డాక్టర్ మహశ్వరరావు డీఎంహెచ్‌వోగా సమర్థవంతగా పనిచేశారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష క్యాంపులు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన ఎంతో శ్రమించి కలెక్టర్, నాటి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా భాను నాయక్
డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్ మహేశ్వరరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడంతో ఆయన స్థానంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ భానునాయక్‌ను ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌వోగా కలెక్టర్ నాగరాణి నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment