మావుళ్లమ్మ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారి జాతర మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉత్సవాలపై ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి ఆయన కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఈనెల 13 నుంచి వచ్చేనెల 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 60 ఏళ్లుగా జాతరను నీరుల్లి, కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఫిబ్రవరి 14 భారీ అన్నసమారాధన రోజున ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, జిల్లా దేవదాయ శాఖ అధికారి వీ.సుబ్బారావు, దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీనగేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment