అధికారుల అండతోనే యథేచ్ఛగా పశువధ
తణుకు అర్బన్: తణుకు ప్రాంతంలో పాలకులు, అధికారులు అందిస్తున్న ప్రోత్సాహంతోనే తేతలిలో లాహం ఫుడ్ ప్రొడక్ట్ సంస్థలో పశువధ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని గోసేవా సమితి సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాస్, జల్లూరి జగదీష్‌లు ఆరోపించారు. తణుకులో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 20 రోజులుగా పశువధపై ఆందోళనలు చేస్తుండగా అణచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 31న 144 సెక్షన్ పేరుతో కర్మాగారం ముందు వేసిన టెంట్లను పోలీసులు తొలగించారని, మరుసటి రోజు నుంచి యథావిధిగా పరిశ్రమలో పశువులను వధిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిశ్రమ చుట్టూ పోలీసుల పహరాలో పశువులను లోపలకు పంపించి వధించడం బాధాకరమని అన్నారు. తణుకులో నిరసన దీక్షలకు అనుమతి కోరితే 144 సెక్షన్ అమల్లో ఉందని, కుదరదని పోలీసులు చెప్పారన్నారు. ఉద్యమంపై ఉక్కుపాదం మోపే దిశగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని విమర్శించారు. అయినా ఆందోళన ఆగదని సేవ్ తణుకు పేరుతో ప్రసార సాధనాలు, సోషల్ మీడియాలో పోరాడతామని హెచ్చరించారు. పరిశ్రమ కు సంబంధించి అధికారుల వద్ద ఏ విభాగంలోనూ పూర్తిస్థాయి అనుమతులు లేవన్నారు. ఐ.శ్రీనివాసరావు, మల్లుల శ్రీనివాస్, కోట వెంకట బాలకృష్ణ, కర్రి రాజశేఖర్, పసుపులేటి సూరిపండు, పంగం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment