రీజినల్‌ చుట్టూ రింగు రైల్‌ | - | Sakshi
Sakshi News home page

రీజినల్‌ చుట్టూ రింగు రైల్‌

Published Mon, Feb 26 2024 1:10 AM | Last Updated on Mon, Feb 26 2024 1:10 AM

- - Sakshi

చౌటుప్పల్‌ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుబంధంగా రైల్వే మార్గం రానుంది. కేంద్రం పచ్చజెండా ఊపడంతో అధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మెట్రో రై మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్‌ నగరవాసులకే కాకుండా గ్రేటర్‌ చుట్టూ ఉన్న జిల్లాలకు అనేక రకాలుగా ప్రయోజనం చేకూరనుంది. వ్యాపార సంబంధాలు మెరుగుపడనున్నాయి.

నలుదిక్కులా అభివృద్ధి

అభివృద్ధి పూర్తిగా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా వికేంద్రీకరణ చేయాలని, గ్రామాలను పట్టణాలుగా, పట్టణాలను నగరాలుగా, నగరాన్ని మహానగరంగా రూపొందించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాయి. ఆ క్రమంలో హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించి నలుదిక్కులా అభివృద్ధిని విస్తరింపజేయాలన్న ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఔటర్‌ రింగ్‌ రోడ్డు తీసుకువచ్చారు. దీంతో నగరం ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ విస్తరించింది. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీజినల్‌ రింగ్‌రోడ్డును ప్రతిపాదించాయి. ఈ రోడ్డుకు సమాంతరంగా రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించాయి. రింగ్‌రోడ్డు పనులు ప్రారంభం కాగానే ఆ వెంటనే రింగ్‌ రైల్‌ ప్రాజెక్టు పనులు సైతం మొదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా రింగ్‌ రైల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల వరంగల్‌లో వెల్లడించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానంగా మెట్రో రైలును అందుబాటులోకి తెస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు.

344 కిలో మీటర్ల దూరం రీజినల్‌ రింగ్‌ రోడ్డు

రీజినల్‌ రింగ్‌రోడ్డును ఉత్తరం, దక్షిణ భాగాలుగా విభజించి 344 కిలో మీటర్ల దూరం ప్రతిపాధించారు. ముందుగా ఉత్తర భాగంలో సంగారెడ్డి నుండి చౌటుప్పల్‌ వరకు 158 కిలో మీటర్లకు సంబంధించిన ప్రక్రియను చాలా నెలల క్రితమే ప్రారంభించారు. ఈ భాగంలో యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 19 మండలలాకు చెందిన 113 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది. దక్షిణ భాగంలో చౌటుప్పల్‌ నుంచి కంది వరకు 186 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు నిర్మాణం జరగనుంది.

ప్రయోజనాలు ఇలా..

మహానగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్‌పై ప్రస్తుతం వివిధ రకాలుగా భారం పడుతోంది. ఔటర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెంట రైల్వే మార్గాలు ఏర్పాటైతే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. వ్యాపార సంబంధాలు మెరుగుపడుతాయి. ఎన్నో రకాల పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. అనేక మండలాలు, గ్రామాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించనుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెంట మహానగరం విస్తరించనుంది.

ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం

ప్రాజెక్టు అంశాన్ని ఇటీవల

వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా నిర్ణయం

అందుబాటులోకి వస్తే

జిల్లాకు మహర్దశ

విస్తరించనున్న చౌటుప్పల్‌ ప్రాంతం

రీజినల్‌ రింగ్‌రోడ్డు, రింగ్‌ రైల్‌ ద్వారా జిల్లాలోనే చౌటుప్పల్‌ ప్రాంతానికి మహర్దశ చేకూరనుంది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళ్తోంది. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తయితే మరింత విస్తరించే అవకాశం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనమయ్యే అవకాశం లేకపోలేదు. డివిజన్‌ పరిధిలోని సంస్థాన్‌నారాయణపురం, రామన్నపేట, వలిగొండ మండలాలు సైతం అభివృద్ధి చెందనున్నాయి.

హైదరాబాద్‌ వెళ్లే బాధలు తప్పుతాయి

చౌటుప్పల్‌ ప్రాంతం హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు లేవు. దీంతో చాలామంది తమ పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రింగ్‌ రైల్‌ అందుబాటులోకి వస్తే విద్యాసంస్థలు, ఉపాధి కల్పించే ప్రాజెక్టులు వస్తాయి. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

– కాయితి రమేష్‌గౌడ్‌, పెద్దకొండూర్‌

మాజీ సర్పంచ్‌, చౌటుప్పల్‌

అన్ని ప్రాంతాలు అభివృద్ధి

రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో పాటు దానికి అనుసంధానంగా రింగ్‌ రైల్‌ ఏర్పాటుతో నలుదిక్కులా అభివృద్ధి విస్తరించనుంది. భవి ష్యత్‌ అవసరాలకు రింగ్‌ రైలు చాలా అవసరంహైదరాబాద్‌పై అన్ని రకాలుగా ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా అభివృద్ధిపరంగా చౌటుప్పల్‌ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయి. మహానగరంలోని సౌకార్యాలన్నీ అందుబాటులోకి వస్తాయి.

–ఆలె చిరంజీవి, బీజేవైఎం

రాష్ట్ర నాయకుడు, చౌటుప్పల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement