బీబీనగర్: మండలంలోని జైనపల్లి గ్రామంలో ఉన్న పోచమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం 10 తులాల వెండి, అమ్మవారి బంగారు తాళిబొట్టు అపహరించకుపోయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
తిప్పర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన తిప్పర్తి మండలంలోని మల్లేపల్లివారిగూడెం వద్ద బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జూకూరి కొండయ్య(65) ఉదయం తన వ్యవసాయ పొలానికి కాలినడకన వెళ్తుండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కొండయ్య తలకు, కాళ్లకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు జూకూరి గురువయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రాంమూర్తి తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వ్యక్తి మృతదేహం లభ్యం
భువనగిరి క్రైం: భువనగిరి పట్టణంలోని హుస్సేనాబాద్ శివారులో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనాబాద్ లోని ధర్మవన నేచర్ ఆర్చ్‌లో కార్మికులు గడ్డి తీస్తుండగా.. ప్రధాన గేటు వద్ద వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని మేనేజర్ వేణుగోపాల్ రావుకు చెప్పగా ఆయన పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతిచెందిన వ్యక్తికి సుమారు 20 నుంచి 30 మధ్యన వయసు ఉంటుందని, రెండు నెలల క్రితం మరణించి ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
మద్దిరాల: మనస్తాపానికి గురైన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మద్దిరాల మండల పరిధిలోని చిన్ననెమిల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిదిలోని చిన్ననెమిల గ్రామానికి చెందిన దబ్బెటి మహేష్, గణిత(33) భార్యభర్తలు. వీరి మధ్య మంగళవారం రాత్రి చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గణిత బుధవారం తెల్లవారుజామున ఇంటి పక్కనే గల వ్యవసాయ భూమి వద్ద క్రిమి సంహారక మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి తండ్రి జగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గణిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దాడి కేసులో
నలుగురికి రిమాండ్
చందంపేట: మండలంలోని గువ్వలగుట్టతండా గ్రామంలో మంగళవారం ఎకై ్సజ్ సిబ్బందిపై గువ్వలగుట్ట గ్రామానికి చెందిన రమావత్ హన్మా, రమావత్ రంగ, రమావత్ లోక్‌నాథ్ రమావత్ లక్పతిలు దాడి చేసి గాయపర్చారు. ఈమేరకు బుధవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment