ఇద్దరు దొంగల అరెస్టు
పెద్దఅడిశర్లపల్లి: పెద్దఅడిశర్లపల్లి మండలంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను గుడిపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబు వివరాలు వెల్లడించారు. మండలంలోని అంగడిపేటకు చెందిన తంగిల గంగాధరాచారి, మోటమర్రి ఆంజనేయులు జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతేడాది మండల కేంద్రంలోని వంగాల లక్ష్మారెడ్డి ఇంట్లో బంగారం, రూ.ఐదు లక్షల నగదు చోరీకి గురైంది. లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నమ్మదగిన సమాచారంతో బుధవారం ఉదయం అంగడిపేట ఎక్స్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా కారులో వెళ్తున్న అంగడిపేటకు చెందిన తంగిల గంగాధరాచారి, మోటమర్రి ఆంజనేయులును నిందితులుగా గుర్తించి విచారణ చేశారు. మండల కేంద్రంలో జరిగిన దొంగతనంతో పాటు గత వారంలో అంగడిపేటలో జరిగిన చోరీ, కొండమల్లేపల్లిలో ఎలక్ట్రికల్ షాపులో జరిగిన చోరీ తామే చేసినట్లు వారు అంగీకరించారు. వారి నుంచి చంద్రహారం, రూ.45 వేలు, కూలర్ మోటార్లు, వడ్రంగి సామన్లు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొమ్ము సుమారు రూ.6 లక్షల విలువ ఉంటుందని డీఎస్పీ తెలిపారు. దొంగలను పట్టుకున్న కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ్య, గుడిపల్లి ఎస్‌ఐ నర్సిహులు, కానిస్టేబుళ్లు శ్రీధర్‌రెడ్డి, హేమునాయక్, భాస్కర్, గురువారెడ్డి, లింగయ్య, రవిలను డీఎస్పీ అభినందించారు.
ఫ బంగారు ఆభరణాలు,
రూ.45 వేల నగదు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment