22న దివ్యాంగులకు క్రీడా పోటీలు
భువనగిరిటౌన్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 22న భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జూనియర్స్ విభాగంలో 10–17 ఏళ్ల బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో 18–35 ఏళ్ల సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు, ఆధార్, సదరం సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు.
హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం వాహనాల రద్దీ నెలకొంది. వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజానీకం పెద్ద ఎత్తున రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో వాహనాల రద్దీ ఏర్పడింది. రోడ్డు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది.
23న విద్యుత్ గ్రీవెన్స్ డే
భువనగిరి : విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఈనెల 23వ తేదీన భువనగిరిలోని డీఈ కార్యాలయంలో విద్యుత్ గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీవెన్స్ డేకు హాజరయ్యే విని యోగదారులు ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు రశీదు తీసుకుని రావాలని సూచించారు. భువనగిరి డివిజన్ పరిధిలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఖాళీ ప్లాట్లు, శిథిల ఇళ్ల యజమానులకు నోటీసులు
మోత్కూరు : పట్టణంలో శిథిలావస్థకు చేరిన ఇళ్ల యజమానులు, చెత్తా చెదారంతో నిండిన ప్లాట్ల యజమానులకు బుధవారం మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓపెన్ ప్లాట్లు చెత్తాచెదారం, కంపచెట్లతో నిండి ప్రమాదకరంగా మారినట్లు గుర్తించామని కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఖాళీ ప్లాట్ల నుంచి ఇళ్లలోకి విష సర్పాలు, కీటకాలు వస్తున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, వెంటనే శుభ్రం చేసుకోవాలని సూచించారు.
నూరు శాతం ఫలితాలు సాధించాలి : డీఈఓ
మోత్కూర్ : పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు కృషి చేయాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. మోత్కూరులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బుధవారం కేజీబీవీల ప్రత్యేకాధికారులు, అకౌంటెంట్లకు అకడమిక్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
గ్రంథాలయాల పాత్ర గొప్పది
భువనగిరిటౌన్ : స్వాతంత్ర ఉద్యమంలో గ్రంథాలయాల పాత్ర గొప్పదని అదనపు కలెక్టర్ గంగాధర్ తెలిపారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథాల య వారోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ..గ్రంథాలయాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రంథాలయ అధికారి మధుసూదన్‌రెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, నరసింహారావు, ఆవుల వినోద్, సుతారపు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment