స్వచ్ఛతలో మెరిసేలా..
ప్రజలు సహకరించాలి
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధనకు ప్రజలంతా సహకరించాలి. తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలి. ఈ విషయమై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు మున్సిపాలిటీలో పర్యటించే అవకాశం ఉంది. –రామాంజులరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి
భువనగిరి : స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలకు భువనగిరి మున్సిపాలిటీ సన్నద్ధమవుతోంది. గతంలో రాష్ట్ర స్థాయిలో 3,4 స్థానాల్లో నిలువగా ఈసారి మొదటి ర్యాంకు సాధించేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చెత్త సేకరణ, పరిశుభ్రత, రోడ్లు, వీధుల సుందరీకరణ అంశాలపై దృష్టి సారించింది.
మున్సిపాలిటీలో 14,547 గృహాలు
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 14,547 నివాస గృహాలు, 70 వేలకు పైగా జనాభా ఉంది. పట్టణంలోని ఇళ్లనుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ ద్వారా తడి చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నారు.తడి చెత్త నుంచి తయారు చేసిన కంపోస్టు ఎరువును హరితహారంలో నాటిన మొక్కలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.
రోజూ 22వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
మున్సిపాలిటీ పరిధిలో నిత్యం 22వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో తడి చెత్త 10 వేల మెట్రిక్ టన్నులు, పొడి చెత్త 6వేల మెట్రిక్ టన్నులు కాగా.. మిగిలిన 4 వేల మెట్రిక్ టన్నులు వివిధ వ్యర్థాలతో కూడిన చెత్త సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్ యార్డుకు తరలించి నిల్వచేస్తున్నారు. ఇళ్ల వద్దనే తడి చెత్తను వేరు చేసి తీసుకోవడం ద్వారా డంపింగ్ యార్డులో కంపోస్టు ఎరువు తయారీ కోసం ప్రత్యేకంగా వేరు చేసే పని తప్పుతుంది. తద్వారా డంపింగ్ యార్డులో సిబ్బందిపై భారం తగ్గనుంది. చెత్త సేకరణకోసం 18 ఆటోలు, 4 ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. 52 మంది పారిశుద్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.
పట్టణంలో పర్యటించనున్న ప్రతినిధులు
స్వచ్ఛ సర్వేక్షణ్ –2024–25లో ర్యాంకుకు ఎంపిక చేసేందుకు గాను స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధుల బృందం త్వరలో భువనగిరి మున్సిపాలిటీలో పర్యటించనుంది. పరిశుభ్రతపై ప్రజలను ప్రశ్నలు అడగనుంది. వారు చెప్పే సమాధానాల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.
ఫ మొదటి ర్యాంకుపై భువనగిరి మున్సిపాలిటీ ఫోకస్
ఫ ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన
ఫ తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమాలు
ఫ పరిశుభ్రత, రోడ్ల సుందరీకరణపై దృష్టి
ఫ త్వరలో పట్టణంలో పర్యటించనున్న స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు
మెరుగైన ర్యాంకు కోసం తీసుకుంటున్న చర్యలు ఇవీ..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2022–23లో భువనగిరి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు, 2023–24 సంవత్సరానికి 3వ స్థానం దక్కింది. ఈ సారి మొదటి స్థానంలో నిలిచే దిశగా మున్సిపల్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
తడి, పొడి చెత్తను వేరే చేసి ఇచ్చేందుకు వారం రోజులుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తెల్లవారుజామున నాలుగు గంటలకే వీధుల్లో పర్యటించి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
డ్రెయినేజీలను శుభ్రం చేయించడంతోపాటు చెత్త తరలింపు ప్రక్రియల్లో ఆటంకాలు లేకుండా చూస్తున్నారు.
పారిశుద్ధ్య సమస్యపై ప్రజలనుంచి ఫిర్యాదులు అందగానే పరిష్కరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment