ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి
యాదగిరిగుట్ట: ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీలో మంగళవారం సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తనకు ఇచ్చిన సమయంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు శాసీ్త్రయంగా జరగలేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది కానీ రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయలేదన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల రెవెన్యూలో అనేక భూ సమస్యలు పెరిగాయని, అనేకం అపరిష్కృతంగా ఉండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అందుకే కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తుందన్నారు. ప్రస్తుతం ఆర్డీఓలను కలిసేందుకు రైతులు, భూమి హక్కుదారులు 50 నుంచి 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నారని, అంత దూరం ప్రయాణం లేకుండా ఉండేందుకు పరిపాలనా సౌలభ్యం కోసం ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో 17 మండలాలకు రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, భువనగిరి రెవెన్యూ డివిజన్ పైన అధిక పని భారం పడుతుందన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో దాదాపు 8 మండలాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దానితో పాటు రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మోటకొండూరు మండలంలో దగ్గర ఉన్న అన్ని గ్రామాలను పరిగణనలోకి తీసుకోకుండా దూరంగా ఉన్న గ్రామాలను కలపడం వల్ల ఇబ్బందిగా ఉందన్నారు. ఇలాంటివి దగ్గర ఉన్న మండలంలో కలపాలని కోరారు. ఈ విషయమై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్‌తో సమాచారం సేకరించిన అనంతరం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఫ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
Comments
Please login to add a commentAdd a comment