ఉలిక్కిపడిన పెద్దకందుకూరు
రూ.60లక్షల నష్ట పరిహారం,
ఒకరికి ఉద్యోగం
మృతుడు మార్క కనకయ్య కుటుంబానికి రూ.60 లక్షల నష్టపరిహారం, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం శనివారం సాయంత్రం ప్రకటించింది. పరిశ్రమ యాజమాన్యం, అధికార టీఆర్‌ఎస్‌కేవీ యూనియన్ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డితో పాటు పలు కంపెనీ యూనియన్‌లతో కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. అదేవిధంగా వారికి రావాల్సిన పూర్తి బెన్‌ఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పరిశ్రమ యాజమాన్యం భరిస్తుందన్నారు.
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ పరిశ్రమలో శనివారం భారీ పేలుడు సంభవించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పరిశ్రమలోని ప్రొడక్ట్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లోని పైరో డివైసెస్ ఫిల్లింగ్ అండ్ ప్రెస్సింగ్ బ్లాక్‌లో కెమికల్ పెల్లెట్స్‌ను తూకం వేసే సెక్షన్‌లో జరిగిన పేలుడు ధాటికి జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన మార్క కనకయ్య (54) అనే కార్మికుడు మృతిచెందగా.. యాదగిరిగుట్ట మండలం రామాజీపేటకు చెందిన కార్మికుడు మొగిలిపాక ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు, మరో ఇద్దరు కార్మికులు జి. వేణుగోపాల్, ఎస్. నర్సింహులుకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమంలోని ఇతర కార్మికులు పరుగులు తీయడంతో స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్ధం కారణంగా వినికిడి సమస్యతో 46 మంది స్థానిక పీహెచ్‌సీలో, భువనగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స చేయించుకున్నారు.
పెల్లెట్స్ తూకం వేసే విభాగంలో పేలుడు
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ పరిశ్రమలోని పైరో డివైసెస్ ఫిల్లింగ్ అండ్ ప్రెస్సింగ్ బ్లాక్‌లో ఎమ్.టీ.వీ (మెగ్నీషియం, టెఫ్లాన్, వైటన్) అనే రసాయన మిశ్రమం కలిగిన పెల్లెట్‌లను తూకం వేసే విభాగంలో ఉదయం 6 గంటల షిఫ్ట్‌లో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 9 గంటలకు కార్మికులు టిఫిన్ చేయడానికి బ్లాక్ నుంచి బయటకు రాగా, మార్క కనకయ్య, మొగిలిపాక ప్రకాశ్, జి. వేణుగోపాల్, ఎస్. నర్సింహులు మాత్రమే అక్కడే ఉండిపోయారు. 9.40 గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో తూకం వేసే సెక్షన్ గది రూఫ్ ఎగిరిపోయింది. అదే బ్లాక్‌లో మరో మూడుసార్లు పేలుడు సంభవించింది. ఈ క్రమంలో కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మెగ్నీషియం, టెఫ్లాన్, వైటన్ అనే రసాయన మిశ్రమాన్ని తూకం వేసే సమయంలో జరిగిన పొరపాటు వలన పేలుడు జరిగి ఉంటుందని కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 నుంచి 100 కేజీల మిశ్రమం ఆ బ్లాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వాడే పెల్లెట్స్
మెగ్నీషియం, టెఫ్లాన్, వైటన్ రసాయన మిశ్రమ పెల్లెట్స్‌ను పూర్తిస్థాయిలో తయారుచేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వాడుతారని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ మిశ్రమాన్ని ఐఆర్ ఫ్లెయర్స్ మిశ్రమం అని అంటారని పేర్కొన్నారు. ఈ రసాయన పెల్లెట్ పదార్ధాన్ని ఇవ్వడానికి 4 సంవత్సరాల ఆర్డర్ తీసుకున్నామని, ఇప్పటివరకు రెండున్నర లక్షల యూనిట్స్‌ను అందజేశామని, ఇంకా రెండు లక్షల యూనిట్లు ఎయిర్ ఫోర్స్‌కి అందజేయాలని పరిశ్రమ డైరెక్టర్ తెలియజేశారు.
గ్రామ పరిధిలోని ప్రీమియర్
ఎక్స్‌ప్లోజివ్స్ పరిశ్రమలో పేలుడు
10 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దాలు
ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment