● ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
మిర్యాలగూడ టౌన్: ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ–2 సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణంలోని రాపర్తి నగర్‌కు చెందిన సట్టు వెంకటేశ్వర్లు(35)తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని అమరావతి రోడ్డు ప్రాంతానికి చెందిన ముటుకూరి రమ్య, బి. సత్యవతి కలిసి శుక్రవారం మిర్యాలగూడ మండలం బి. అన్నారం గ్రామంలో తమ సమీప బంధువు దహన సంస్కారాలకు హాజరై అదే గ్రామానికి చెందిన నిమ్మల నవీన్ ఆటోలో మిర్యాలగూడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో కోదాడ–జడ్చర్ల హైవేపై దమ్ము చక్రాలతో వెంకటాద్రిపాలెం వైపు వస్తున్నట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వెంకటేశ్వర్లు, నవీన్, రమ్య, సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించగా సట్టు వెంకటేశ్వర్లు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. శనివా రం మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
కాలువలో పడిన ట్రాక్టర్.. ఒకరు మృతి
అనంతగిరి: అదుపుతప్పి ట్రాక్టర్ ఎన్‌ఎస్‌పీ కాలువలో పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన అనంతగిరి మండల కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండల కేంద్రానికి చెందిన బండి వెంకట్రామయ్య(36) తన వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు శనివారం ఉదయం భార్య కావ్య, కుమార్తె అనూషతో కలిసి ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లాడు. భార్య, కుమార్తె పొలం వద్ద ట్రాక్టర్ దిగారు. ఎన్‌ఎస్‌పీ కాలువ నుంచి పొలంలోకి నీళ్లు పెట్టేందుకు వెంకట్రామయ్య ట్రాక్టర్‌పై కాలువ కట్ట మీదుగా వెళ్తుండగా కట్టపై కంపచెట్లను తప్పించబోయి ట్రాక్టర్‌ను ఎడమవైపు తిప్పడంతో అదుపుతప్పి కాలువలో పడింది. ట్రాక్టర్ వెంకట్రామయ్యపై పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపారు.
హుండీలో నగదు చోరీ
అనంతగిరి: మండల కేంద్రంలోని అనంతగిరి కొండపై గల అయ్యప్ప దేవాలయంలో హుండీని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా వంటగది, స్టోర్‌రూం తలుపులు, బీరువా పగులగొట్టారని ఆలయ ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి మురళీకృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment