జాతీయ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటాం
రామగిరి(నల్లగొండ): జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందుంటుందని వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ తెలుగు శాఖ, జాతీయ పరీక్ష కేంద్రం, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్–మైసూర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలుగులో పరీక్ష, మూల్యాంకనం మరియు ప్రశ్నాంశ రచన పద్ధత్ఙి అంశంపై ఉమ్మడి జిల్లా కళాశాలలు, ఉన్నత పాఠశాలల తెలుగు అధ్యాపకులకు ఏర్పాటు చేసిన ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం వైస్ చాన్స్‌లర్ ప్రారంభించి మాట్లాడారు. బోధన, ప్రశ్నావళి రూపకల్పన, మూల్యాంకనం ఉన్నత విద్యలో అత్యంత కీలకమన్నారు. విద్యార్థుల అభ్యసన సరళిని అధ్యాపకులు అనునిత్యం పరిశీలించాలన్నారు. అనంతరం ముఖ్య వక్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఇంటి భాష, తరగతుల భాష మధ్య అంతరాలు తొలగినప్పుడే భాషోదయం కలుగుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రతి వైజ్ఞానిక ఆవిష్కరణను వెంటనే తమ మాతృభాషలో అనువదించే మహోన్నత ప్రక్రియ ద్వారా పేటెంట్లు, నోబెల్ బహుమతులు సాధించగలుగుతున్నాయన్నారు. భారతదేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం రెండు పేటెంట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. తద్వారా భాష వల్ల సమకూరే సంపద సృష్టి మనం చేజార్చుకుంటున్నామని చెప్పారు. మాతృ భాష పట్ల గౌరవంతో పాటు అంతర్జాలంలో సైతం మాతృభాష వినియోగం వల్ల అభ్యసనం సులభతరం అవుతుందన్నారు. భాష అనే సాధనం ద్వారా సమాజ హితమైన ఆవిష్కరణలకు ఆస్కారం కలుగుతుందన్నారు. అనంతరం బోళ్ల నారాయణరెడ్డి పరీక్ష మూల్యాంకనం, జాతీయ విద్యావిధానం–2020పై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు భుజంగరెడ్డి, తెలుగు సాహిత్యం బోధన పద్ధతులపై డాక్టర్ వెల్దండి శ్రీధర్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ అండ్ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కె. అరుణప్రియ, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ సత్యనారాయణరెడ్డి, అనితకుమారి, జి. నరసింహ, డాక్టర్ కృష్ణ కౌండిన్య తదితరులు పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ
వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్
Comments
Please login to add a commentAdd a comment