బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
తిప్పర్తి: బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం తిప్పర్తి మండల కేంద్రం సమీపంలో జరిగింది. తిప్పర్తి ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్(35) నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని హ్యాపీ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్నాడు. శ్రీనివాస్ శనివారం పని నిమిత్తం బైక్‌పై తిప్పర్తికి వెళ్తుండగా.. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై తిప్పర్తి మండల కేంద్రం సమీపంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయం వద్ద వెనుక నుంచి కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లగా.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన కొండసారి శిరీష(39) కారులో నుంచి ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడి మృతిచెందింది. కారు డ్రైవర్ టంగుటూరి సందీప్‌తో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న మరో మహిళ రూపూడి రాణికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కొండసాని శిరీష, రూపూడి రాణి క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారని, శిరీష ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె రాణిని తోడుగా తీసుకుని టంగుటూరి సందీప్ కారులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు గంధం శ్రీనివాస్ భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. శ్రీనివాస్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, శిరీషకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
యాదగిరి కొండపై డ్రోన్ చక్కర్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో శనివారం డ్రోన్ కెమెరా చక్కర్లు కొడుతూ కనిపించింది. ఆర్‌ఐ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు శనివారం సాయంత్రం వచ్చాడు. బ్రేక్ దర్శనం పూర్తయిన తర్వాత సదరు యువకుడు తనతో తెచ్చుకున్న డ్రోన్‌ను ఆలయ ఉత్తర మాడ వీధిలో నిల్చోని ఆన్ చేసి ఆలయాన్ని చిత్రీకరించేందుకు యత్నించాడు. వెంటనే అక్కడ ఉన్న ఎస్‌పీఎఫ్, హోంగార్డు సిబ్బంది, ఆలయ సిబ్బంది అప్రమత్తమై ఆర్‌ఐ శేషగిరిరావు ఆదేశాలతో చిత్రీకరించకుండా ఆపివేశారు. అక్కడికి చేరుకున్న ఆర్‌ఐ శేషగిరిరావు యువకుడి వద్ద ఉన్న డ్రోన్ కెమెరాను తీసుకొని, ఆలయ డో భాస్కర్‌రావుకు సమాచారం ఇచ్చారు. ఈఓ అందుబాటులో లేకపోవడంతో డ్రోన్ కెమెరాను సీజ్ చేసి, ఆదివారం ఈఓ వచ్చిన తర్వాత విచారణ చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ శేషగిరిరావు వెల్లడించారు. డ్రోన్ కెమెరాలో ఆలయ పరిసరాలు రికార్డు కాలేదని ఆయన పేర్కొన్నారు.
మరో ఇద్దరికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment