రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
వేములపల్లి: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని తూర్పు చంపార జిల్లాకు చెందిన దొరగ సహని(45) తన కుమారుడు ప్రదీప్‌కుమార్ సహనితో కలిసి మూడు నెలల క్రితం వేములపల్లికి వలస వచ్చి శెట్టిపాలెం గ్రామ శివారులోని మహర్షి రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ప్రదీప్‌కుమార్ సహని మిల్లు ఎదురుగా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారికి అవతల వైపు దుకాణం వద్ద కూర్చొని ఉండగా అతడిని తీసుకొచ్చేందుకు దొరగ సహని రోడ్డు దాటుతుండగా అదే సమయంలో మిర్యాలగూడ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం మృతుడి కుమారుడు ప్రదీప్‌కుమార్ సహని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య సునీతాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment