అడ్డగోలుగా ఔట్‌ సోర్సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా ఔట్‌ సోర్సింగ్‌

Published Thu, Jan 9 2025 2:24 AM | Last Updated on Thu, Jan 9 2025 2:24 AM

అడ్డగోలుగా ఔట్‌ సోర్సింగ్‌

అడ్డగోలుగా ఔట్‌ సోర్సింగ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరుతో దందాకు తెరలేచింది. హైదరాబాద్‌లోని ఆ శాఖాధిపతి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి అండదండలతో ఆయన బంధువు ఒకరు ఈ దందా చేస్తున్నట్లు తెలిసింది. పోస్టులు ఉన్నా, లేకున్నా భారీగా ముడుపులు పుచ్చుకొని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో వీటికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. పోనీ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారా? అంటే అదీ లేదు. నేరుగా శాఖాధిపతి కార్యాలయంలో నుంచే ముడుపులు ముట్టజెప్పిన వారికి ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే మరింత మందికి పోస్టింగ్‌ ఇస్తామని భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెతుతున్నాయి.

ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు?

ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో సిబ్బంది కొరత పేరుతో హైదరాబాద్‌లోని ఆ శాఖాధిపతి కార్యాలయం నుంచి గురుకులాల సొసైటీ పేరుతో ఆర్డర్లు జారీ అవుతున్నాయి. ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితర పోస్టులను అడ్డగోలుగా అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని ఆ శాఖ కార్యాలయంలో పని చేసే ఓ అధికారి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు కావడం, ఇప్పుడు అదే అధికారి తన సమీప బంధువు నేతృత్వంలో ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నారు. ఇప్పటికే 30కి పైగా పోస్టులకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

ఔట్‌సోర్సింగ్‌ ఏదీ?

గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయం నుంచి జారీ అవుతున్న పోస్టింగ్‌ ఆర్డర్లలో ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఏదనేది స్పష్టం చేయడం లేదు. ఏ ఏజెన్సీ ద్వారా ఈ నియామకాలు చేస్తున్నారనేది అభ్యర్థులకు ఇచ్చిన ఉత్తర్వుల కాపీల్లో పేర్కొనలేదు. సాధారణంగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా వ్యక్తిగతంగా ఆర్డర్లను జారీ చేయదు. కానీ గిరిజన గురుకుల కాలేజీల్లో పోస్టులకు మాత్రం నేరుగా ఆ సొసైటీ నుంచే ఆర్డర్లు జారీచేస్తుండటం గమనార్హం. పైగా అందులో తాము నియమిస్తున్న సిబ్బందికి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా గౌరవ వేతనం చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసలు ఆ పోస్టుల భర్తీకి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీని ఆ శాఖ ఖరారు చేసిందా? చేస్తే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారానే పోస్టులను భర్తీ చేయాలి. గురుకులాల సొసైటీ ఎందుకు ఆర్డర్లు జారీ చేస్తోంది. లేని ఏజెన్సీ పేరుతో వారికి గౌరవ వేతనం ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో ఒక్కో పోస్టుకు రూ.2లక్షల వరకు ముడుపులు తీసుకొని అక్రమంగా నియామకాలు చేపడుతున్నారు. ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగమంతా హైదరాబాద్‌లోని ఆ శాఖలో పనిచేసే ఓ అధికారి బంధువు ద్వారా

జరగుతున్నట్టు సమాచారం.

గిరిజన గురుకుల కాలేజీల్లో అక్రమంగా నియామకాలు

ఫ సిబ్బంది కొరత పేరుతో పోస్టుల అమ్మకాలు

ఫ ఒక్కో పోస్టును రూ.2 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణ

ఫ హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన

నియామకాల బాగోతం

ఫ ఓ ఉన్నతాధికారి తమ బంధువు ద్వారా వసూళ్లు

సమగ్ర విచారణ జరిపించాలి

గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో సిబ్బంది కొరత పేరుతో పోస్టుల భర్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి. ఈ పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులను రాష్ట్ర స్థాయిలో, ఏజెన్సీ లేకుండానే ఎలా భర్తీ చేస్తారు.

– రవినాయక్‌, రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement