సర్కారు బకాయిలు రూ.1.60 కోట్లు
భువనగిరిటౌన్: జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. ఫలితంగా చెల్లించాల్సిన అసలు పన్నుకు వడ్డీ కలిపి రెట్టింపు అవుతోంది. మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్ను వసూలుపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
చెల్లించేందుకు విముఖత
ప్రతి ఏడాది పన్ను చెల్లించకపోవడంతో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలు రూ. లక్షల్లో పేరుకుపోతున్నాయి. ఆయా కార్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచి పన్ను చెల్లించే వెసులుబాటు ఉన్నా అధికారులు చెల్లించడానికి విముఖత చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో మున్సిపాలిటీకి న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి పన్ను రాకపోవడంతో అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఇబ్బందికరంగా మారాయి.
64 కార్యాలయాలకు
అందించనున్న నోటీసులు
64 ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆస్తిపన్ను రూ.1.60 కోట్లు రావాల్సి ఉంది. దీంతో ఈ కార్యాలయాలకు నోటీసులు అందించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా కార్యాలయాల పేర్లతో నోటీసులు ముద్రించారు. ఎక్కువగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం రూ. 31.60లక్షలు, మండల పరిషత్ కార్యాలయం రూ. 26.07 లక్షలు, భువనగిరి ఆర్డీఓ కార్యాలయం రూ. 18.77లక్షలు, డీసీపీ కార్యాలయం రూ. 7.48లక్షలు, రహదారి బంగ్లా రూ.7.36 లక్షలు, టౌన్ పోలీస్ స్టేషన్ రూ. 6.07లక్షలు, రూరల్ పోలీస్ స్టేషన్ రూ. 4.38లక్షలు, కలెక్టరేట్ కార్యాలయం రూ. 96వేలు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా ప్రతి రోజు ఆదాయం వచ్చే ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు, ఆర్టీసీకి సంబంధించిన దుకాణాలు సైతం ఇప్పటి వరకు పన్ను చెల్లించలేదు. దీంతోపాటు మరికొన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి.
ఆస్తిపన్ను చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు
ఫ రెండు, మూడు రోజుల్లో
నోటీసులు అందజేత
ఫ పన్ను చెల్లింపునకు అవకాశం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
నోటీసులు జారీచేస్తాం
పన్ను చెల్లింపు కోసం ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అధికారులు సైతం చెల్లింపు కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. మున్సిపాలిటీ నుంచి కల్పిస్తున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పన్ను చెల్లించేందుకు సహకరించాలి.
– రామాంజులరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment