గుట్ట ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
యాదగిరిగుట్ట రూరల్, యాదగిరిగుట్ట: నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌లోని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయడంతో యాదగిరిగుట్ట ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గోపి నాయక్ బుధవారం సస్పెండ్ అయ్యారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సర్వే నంబర్ 472, 473లో 154 డాక్యుమెంట్‌లను డిసెంబర్ 21, 22, 23వ తేదీల్లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం స్టాంప్స్ అండ్ డ్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయన విచారణకు ఆదేశించారు. విచారణ నిమిత్తం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అధికారి మధుసూదన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఆడిట్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డీటీసీపీ పర్మిషన్ లేకుండా, కేవలం నాలా పర్మిషన్‌తోనే ఈ భూమిని, 154 డాక్యుమెంట్‌లుగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా, వెంచర్‌లోని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేసినందుకు ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గోపి నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ డాక్యుమెంట్‌లను ప్రొహిబిటెడ్‌లో పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్‌లు, భూములు ఎవరూ కొనొద్దని, అమ్మవద్దని అన్ని వివరాలు తెలుసుకుని క్రయవిక్రయాలు జరపాలని వినియోగదారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment