నేడు మంత్రి తుమ్మల రాక
భువనగిరి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం భువనగిరికి రానున్నారు. గంజ్ మార్కెట్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం వలిగొండలోని దేవిశ్రీ గార్డెన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి హాజరుకానున్నారు
పంటల పరిశీలన
మోత్కూరు : నేషనల్ షాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) అధికారుల బృందం బుధవారం మోత్కూరు మండలంలోని పాటిమట్ట గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా 20 సర్వే సబ్ డివిజన్లలో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఈ కార్యక్రమంలో ఫరీదాబాద్‌కు నేషనల్ షాంపిల్ కార్యాలానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వారి వెంట ఏడీఏ నీలిమ, ప్రణాళిక కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలను సమయానికి తెరవాలి
భువనగిరిటౌన్ : అంగన్‌వాడీ కేంద్రాలను సమయానికి తెరవాలని జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు సూచించారు. బుధవారం భువనగిరిలోని బహేర్‌పేట్‌తో పాటు పలు అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారుల హాజరు రిజిస్టర్లు, పౌష్టికాహారం పంపిణీ రికార్డులను పరిశీలించారు. చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. పౌష్టికాహారం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీడీపీఓలు, సూపర్‌వైజర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని పేర్కొన్నారు.
దివ్యాంగుల నుంచి
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి టౌన్ : దివ్యాంగులకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 యూనిట్లు వంద శాతం రాయితీతో రూ.50,000 చొప్పున మంజూరైనట్లు పేర్కొన్నారు. 21 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు అర్హులని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఎంజీయూ
ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ల ఫలితాలను వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ బుధవారం విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 6,300 మంది విద్యార్థులకు గాను 1,338 మంది, మూడవ సెమిస్టర్‌లో 4,509 మందికి 1,569 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదవ సెమిస్టర్‌లో 5,378 మందికి 2,380 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓజీ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ లక్ష్మీ ప్రభ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ రామచంద్రగౌడ్, డాక్టర్ ప్రవళిక, కోఆర్డినేటర్ డాక్టర్ భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
రికార్డులు పరిశీలిస్తున్న
జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు
Comments
Please login to add a commentAdd a comment