గోదాముల అద్దెనుంచి మినహాయింపు ఇవ్వండి
భువనగిరిటౌన్ : ధాన్యం నిల్వ చేసేందుకు వ్యవసాయ మార్కెట్‌ల గోదాములను అద్దెకు తీసుకున్నందున, కిరాయి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మంత్రి తుమ్మలనాగేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. సీఎంఆర్ ధాన్యం నిల్వు చేసేందుకు తమ మిల్లుల్లో సరిపడా స్థలం లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్ గోదాములను కిరాయికి తీసుకున్నట్లు తెలిపారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎగుమతి చేయడంలో జాప్యం జరగడంతో ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో మార్కెట్ కమిటీ వారు అద్దెకోసం నోటీసులు జారీ చేస్తున్నారని, మిల్లర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు మార్త వెంకటేశం, ఉపాధ్యక్షులు వెంకటరమణ, నూనె వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు పశుపునూరి నాగభూషణం ఉన్నారు.
ఆయుష్మాన్
ఆరోగ్యమందిర్ తనిఖీ
భువనగిరి : మండలంలోని అనంతారంలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను గురువారం పాపులేషన్ రీసెర్చ్ కమిటీ అధికారులు తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు మందులు సకాలంలో అందజేయాలని సూచించారు. వారి వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శిల్పిని, మెడికల్ ఆఫీసర్ యామిని శృతి, డాక్టర్ మురళీమోహన్ ఉన్నారు.
అర్హులందరికీ పథకాలు
భూదాన్‌పోచంపల్లి : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ గంగాధర్ పేర్కొన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లిలోని 12వ వార్డు, మండలంలోని దోతిగూడెంలో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముసాయిదా జాబితాలోని పేర్లను మాత్రమే గ్రామసభల్లో చదివి వినిపిస్తున్నామని తెలిపారు. జాబితాలో పేర్లు రానివారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మిశ్రీనివాస్, కమిషనర్ వెంకటేశ్వరనాయక్, ఏఓ శైలజ, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, రాజేశ్, కౌన్సిలర్ దేవరాయ కుమార్, బిజిలి కుమార్, కడవేరు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ సహాయంతో
రక్తనమూనాల తరలింపు
అడ్డగూడూరు : మండలంలోని చౌల్లరామరాంలో 12 మంది టీబీ అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి డ్రోన్ సహాయంతో రామన్నపేట ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌కు పంపించారు. శాంపిల్స్‌ను త్వరగా ఆస్పత్రులకు చేర్చడం ద్వారా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులు అందజేయవచ్చని మండల వైద్యాధికారి భరత్ రాథోడ్ తెలిపారు.
అఖిలపక్ష నేతలను కలిసిన రీజినల్ భూనిర్వాసితులు
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు అండగా ఉండాలని కోరుతూ భూనిర్వాసితులు గురువారం వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను హైదరాబాద్‌లో వారి నివాసాల్లో కలిశారు. ఈనెల 25న భువనగిరిలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు విచ్చేయాలని కోరారు. నేతలను కలిసిన వారిలో భూనిర్వాసితుల వేదిక కన్వీనర్ చింతల దామోదర్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, అవిశెట్టి పాండు, జోసెఫ్, గుజ్జుల సురేందర్‌రెడ్డి, దబ్బెటి రాములు, డిల్లీ మాధవరెడ్డి, మారుపాక రామలింగం, జాల వెంకటేష్, బొమ్మిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, బోరెం ప్రకాష్‌రెడ్డి, మల్లేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment