పలకరిస్తూ.. సేవలపై ఆరా తీస్తూ
చౌటుప్పల్ : ‘ఏం తల్లీ, ఏం అవ్వా.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయి.. సౌకర్యాలు బాగున్నాయా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా’ అంటూ రోగులను పలకరిస్తూ ఆస్పత్రి పరిస్థితిని తెలుసుకున్నారు.. కలెక్టర్ హనుమంతరావు. గురువారం ఆయన చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత డయాలసిస్ వార్డుకు వెళ్లి సేవలపై ఆరా తీశారు. ఆ తరువాత బాలింతలు, జనరల్ వార్డులను తనిఖీ చేశారు. రోగులను పలకరించి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రసవాల తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ కాన్పులు అవుతుండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు 100 కాన్పులకు గాను కేవలం 30 కాన్పులే జరుగుతున్నాయని, పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్యులు సూచించారు. విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులు, కాంపౌండర్ నోటీసులు జారీ చేశారు. సరైన వివరణ లేకుంటే సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచండి
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, రోగులను ప్రేమగా పలకరించాలని కలెక్టర్ హనుమంతరావు వైద్యసిబ్బందికి సూచించారు. ఆస్పత్రి జాతీయ రహదారిపై ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యసిబ్బంది రోజూ 9 గంటల లోపు ఆస్పత్రిలో ఉండాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, వైద్యురాలు అలివేలు, ఆర్‌ఐ సుధాకర్‌రావు ఉన్నారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత, కేజీబీవీ, మోడల్, సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రధానోపోధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అభ్యాసన దీపికల ద్వారా ప్రాక్టీస్ చేయించి స్లిప్ టెస్టులు నిర్వహించి పరీక్షల పట్ల భయం తొలగించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ సత్యనారా యణ, ఏడీ ప్రశాంత్‌రెడ్డి, అకడమిక్ మానటరింగ్ అధికారి శ్రీనివాస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ సీహెచ్‌సీని
తనిఖీ చేసిన కలెక్టర్
విధులకు గైర్హాజరైన ఇద్దరు డాక్టర్లు, కంపౌండర్‌కు నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment