కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున ఓ వ్యక్తిని ఆటోలో నుంచి కిడ్నాప్ చేసి, అతన్ని తమ వెంట తీసుకుని వెళ్లి దాదాపు 33 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం హల్‌చల్ చేసింది. ఒక్కసారిగా పోలీసులు, స్థానికంగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనతో పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేసి వెంటనే రంగంలోకి దిగారు. ఈ సంఘటనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
● కడప నగరం ఖలీల్ నగర్‌కు చెందిన ఇలియాజ్ తన స్నేహితుడు వినాయక్‌నగర్‌కు చెందిన బిలాల్‌తో కలిసి ఫిబ్రవరి 19న దుబాయ్‌కి వెళ్లివస్తానని ఇంటిలో చెప్పి వెళ్లాడు. 21న అక్కడికి చేరుకున్నారు. అదేనెల 26న ఇలియాజ్ మాత్రం కడపకు వెళతానని స్నేహితుడికి చెప్పి వచ్చాడు. వచ్చేటప్పుడు బిలాల్, తన దగ్గరున్న డబ్బుతో 43 తులాల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి ఇలియాజ్ చేతికి ఇచ్చి కడపలో తన బంధువులకు ఇవ్వమని చెప్పి పంపాడు. ఇలియాజ్ 26వ తేదీన తెల్లవారుజామున ముంబయిలో దిగాడు. అక్కడి నుంచి డార్జిలింగ్‌లో ఉన్న తన రెండవ భార్య దగ్గరికి వెళ్లాడు. తరువాత ఈనెల 6వ తేదీన డార్జిలింగ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి బిలాల్‌కు, ఇలియాజ్‌కు ఇద్దరికి స్నేహితుడైన అస్లాం ద్వారా ఈనెల 8వ తేదీన రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌లో బస్కెక్కాడు. శనివారం తెల్లవారుజామున కడప ఏడురోడ్ల కూడలిలో బస్సుదిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అప్పటికే బిలాల్ తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇలియాజ్ దుబాయ్ నుంచి కడపకు బంగారును తీసుకుని వచ్చాడని, వస్తే అతని దగ్గరి నుంచి బంగారును తీసుకోవాలని చెప్పాడు. తన దగ్గరి నుంచి వచ్చినప్పటి నుంచి ఇలియాజ్ ఫోన్ పనిచేయలేదని కూడా చెప్పాడు. ఈ క్రమంలోనే బిలాల్‌కు, ఇలియాజ్‌కు స్నేహితుడైన అస్లాం గత రాత్రి హైదరాబాద్‌లో బస్సెక్కించిన విషయం బిలాల్‌కు తెలియజేశాడు. ఇలియాజ్ కడపలో బస్సు దిగి ఆటో ఎక్కగానే బిలాల్ బంధువులు హుసేన్, పర్వేజ్, మరో ఇద్దరు స్నేహితులు కలిసి వెంబడించారు. శివలింగం బీడీ వీధిలోకి రాగానే అక్కడి నుంచి అతనితో వాగ్వాదానికి దిగారు. తరువాత అతన్ని ఆటోలో తమ వెంట కిడ్నాప్ చేసుకుని వెళ్లారు. కొంతసేపటికి ఇలియాజ్ కిడ్నాప్‌కు గురయ్యాడని అతని తల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీఐ ఇబ్రహీం, పోలీసులు ఇలియాజ్ ఆచూకీ కోసం వెతికారు. కొంతసేపటికి ఇలియాజ్ తాను క్షేమంగానే వున్నానని, తన దగ్గరికి వచ్చిన వారు 33 తులాల బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కెళ్లారని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు.
● బాధితుడిని పోలీసులు ప్రాథమికంగా విచారించిన సమయంలో తాను బిలాల్ పంపిన 43 తులాల బంగారులో 10 తులాలు అమ్మేసి జల్సా చేశానని, మిగిలిన 33 తులాల బంగారు ఆభరణాలను వారు లాక్కెళ్లారని తెలిపాడు. మరలా కొంత సమయం తరువాత ఇలియాజ్ తాను మొదట భయపడి అలా చెప్పానని, తన స్నేహితులు, బంధువుల దగ్గర దాదాపు రూ. 26 లక్షలు మేరకు అప్పులు చేసి బంగారును కొనుగోలు చేసి తీసుకుని వచ్చేందుకు బిలాల్‌తో పాటు వెళ్లానని చెప్పాడు. తాను దుబాయ్‌లో బంగారును కొనుగోలు చేశానన్నాడు. తన వెంట తెచ్చిన బంగారులో 10తులాలు హైదరాబాద్‌లో విక్రయించి జల్సాకు పాల్పడ్డానని,, మిగతా 33 తులాల బంగారును బిలాల్ తరపున వచ్చిన వారు లాక్కెళ్లారని తెలియజేశాడు. కాగా బాధితుడు చెబుతున్న విషయాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండటంతో ఈ సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనను కొట్టి 33 తులాల బంగారు
ఆభరణాలు లాక్కెళ్లారని ఆరోపణ
సంఘటనపై అనేక అనుమానాలు
సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
సమగ్రంగా విచారిస్తున్నాం
ఈ సంఘటనలో బిలాల్. ఇలియాజ్‌ల మధ్య జరిగిన సంఘటనల గురించి సమగ్రంగా విచారిస్తున్నామని కడప టూటౌన్ సీఐ జి. ఇబ్రహీం వెల్లడించారు. ఎవరు బంగారును కొనుగోలు చేశారు? ఎవరు కడపకు పంపించారు లేక తీసుకుని వచ్చారు? ఇలియాజ్ ఫిబ్రవరి 26న వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనే విషయాలపై విచారణ చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. – కడప టూటౌన్ సీఐ ఇబ్రహీం వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment