దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలి
కడప సెవెన్‌రోడ్స్ : దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ సంక్షేమ సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించి జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విధానాన్ని తీసుకు రావాలన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా వెంటనే అమలు చేయాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్ ప్రవేశ పెట్టాలన్నారు. యువత, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఈడబ్ల్యుఎస్ పది శాతం రిజర్వేషన్లు తక్షణమే రద్దు చేయాలన్నారు. ఎన్నికలకు ముందు బీసీల గురించి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకు తమకు చేసిన మేలు అంటూ ఏమీ లేదని విమర్శించారు. తమ డిమాండ్లను విస్మరిస్తే రాష్ట్రంలోని బీసీలు కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తారని హెచ్చరించారు. బీసీ మహాసభ వ్యవస్థాపకుడు అవ్వారు మల్లికార్జున, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు శ్రీనివాసులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment