ప్రతిభకు పరీక్ష
కడప ఎడ్యుకేషన్ : జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువే మూలం. అలాంటి విద్య విషయమై ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయని పరిశీలించడంతోపాటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెర్మార్మెన్స్ అసెస్‌మెంట్ రివ్యూ అండ్ అనలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్‌మెంట్ (పరఖ్ సర్వేక్షణ–2024) పేరుతో పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ –2024ను(గతంలో నాస్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సర్వేను 2021లో చివరి సారిగా నిర్వహించారు. మరలా తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహణకు విద్యాశాఖ, సమగ్రశిక్ష, ఎస్‌సీఈఆర్‌టీలు చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన సామర్థ్య పరీక్షను డిసెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించనున్నారు.
ఒక్కో పాఠశాల నుంచి..
వైఎస్‌ఆర్ జిల్లాలోని 139 పాఠశాలలను ఈ పరీక్ష కోసం ఎంపిక చేశారు. ఇందులో ఒక్కో పాఠశాల నుంచి తరగతికి 30 మంది చొప్పున 3 తరగతులకు సంబంధించిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. పరాఖ్ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది. జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా స్థాయి కో ఆర్డినేటర్‌గా, డీసీఈబీ సెక్రటరీ సహాయ జిల్లా స్థాయి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించనుండగా సమగ్రశిక్ష ఏఎంఓ, డైట్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్లు ఈ పరీక్షల నిర్వహణకు సహకారం అందించనున్నారు. మండల స్థాయిలో పరీక్షల నిర్వాహకులుగా ఎంఈఓలతోపాటు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తారు. పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. పరీక్ష నిర్వహించేందుకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 20న డిస్ట్రిక్ లెవల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పరీక్షలు ఇలా..
ఎస్‌సీఈఆర్‌టీ నిర్వహించే పరాఖ్ పరీక్షకు ముందుగా ప్రాక్టీస్ పేపర్ల ద్వారా తర్ఫీదు ఇస్తారు. ఇందులో 3, 6 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం, 9వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, సోషియల్, సైన్సు సబ్జెక్టులపై పరీక్షలు ఉంటాయి. 3వ తరగతి విద్యార్థులకు అదే తరగతి సిలబస్ ఉంటుంది. వీరికి 45 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. అలాగే 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి సిలబస్ ఉంటుంది. వీరికి 51 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్ ఉంటుంది. వీరికి 60 ప్రశ్నలతో 120 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ షీటు విధానంలో పరీక్ష ఉంటుంది.
అభ్యసనా సామర్థ్యాల మెరుగుకు చర్యలు
3,6,9 తరగతుల విద్యార్థుల ప్రావీణ్యం పరిశీలన
పరఖ్ సర్వేక్షణకు 139 పాఠశాలలు ఎంపిక
డిసెంబర్ 4న ఓఎంఆర్ విధానంలో నిర్వహణ
20న శిక్షణ
పరాఖ్ పరీక్ష కోసం ఎంపిక చేసిన 165 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, అబ్జర్వర్లు, మండల విద్యాశాఖ అధికారులకు ఈ నెల 20న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ శిక్షణ కడపలోని డీసీఈబీలో ఉంటుంది. పరీక్షల నిర్వహణపై పూర్థి సాయి అవగాహన కలిగిస్తాం.
– విజయ భాస్కర్‌రెడ్డి, సెక్రటరీ, డీసీఈబీ
సమర్థవంతంగా..
జిల్లా వ్యాప్తంగా పరాఖ్ పరీక్ష సమర్థవంతంగా నిర్వహిస్తాం. అవసరమైన ఏర్పాట్లు, సిబ్బంది నియామకం కూడా పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 6,9 తరగతులకు సంబంధించి విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
– మీనాక్షి, జిల్లా విద్యాశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment