No Headline
పేద విద్యార్థుల ‘వసతి’కి చెదలు పట్టింది. అధికారుల అవినీతి దాహానికి.. పాలకుల నిర్లక్ష్య వైఖరికి ప్రభుత్వ హాస్టళ్లు సమస్యల్లో చిక్కుకుపోయాయి. ఫలితంగా పేద పిల్లలు విద్యావంతులుగా ఎదగడానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ వసతి గృహాలకంటే కారాగారాలే నయం అనేలా పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని ఆయా హాస్టళ్లలో ‘సాక్షి’ పరిశీలనలో చేదు నిజాలు వెలుగుచూశాయి.
● ఇంకా బహిర్భూమికి ఆరు బయటకే
● కప్పుకొనే దుప్పటి..తినే కంచానికీ కరువే
● విద్యార్ధుల్లో ప్రతిభ పుష్కలం..కరువైన పాలకుల ప్రోత్సాహం
● సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు
కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో సమస్యలు తిష్ట వేశాయి. కప్పుకునే దుప్పటి మొదలు తినే కంచం దాకా కరువే అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇక బహిర్భూమికి ఇప్పటికీ ఆరుబైటకే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు ఆయా హాస్టళ్లలో సమస్యలతో సావాసం చేస్తూనే చదువుకుంటున్నారు. వారి విద్యాభివృద్ధి కి ‘వసతి సౌకర్యాలు’పెను సమస్యగా మారాయి.
ప్రభుత్వం చిన్నచూపు
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటింది. ఇటీవల రెండు నెలలకు సంబంధించిన డైట్ బిల్లులు వచ్చాయి. ఇంకా మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు రావాల్సి ఉంది. దీని ప్రభావం విద్యార్థులకు అందించే పౌష్టికాహరంపై పడింది. ఫలితంగా చాలా హాస్టళ్లలో ‘మెను’దారి తప్పింది. ఈ క్రమంలో గుడ్డు తదితర ఆహారపదార్థాలు విద్యార్థులకు అందడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు దాటినా బీసీ, ఎస్సీ వసతి గృహాల్లోని ప్రీ మెట్రిక్ (3 నుంచి 10వ తరగతి) విద్యార్థులకు ఇప్పటివరకు దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు అందలేదు. వీటిని ఏడాదికి ఒకసారి విద్యా సంవత్సరం ప్రారంభమైన కొద్దిరోజులకే ఇవ్వాలి. వర్షాకాలం ముగిసింది, చలికాలం ప్రారంభమైంది. ఇంతవరకు విద్యార్థులకు దుప్పట్లు అందలేదు. ఇక ఉన్న ప్లేట్లు, గ్లాసులతోనే సర్దుబాటు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment