సింహాద్రిపురం : నాలుగు మేకలకు గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గొర్రెల యజమాని తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన కొమ్మెర రాజప్పకు చెందిన గొర్రెల గుంపును బుధవారం గొర్రెల దొడ్డిలో ఉంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి వెళ్లేలోపు ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు గొర్రెల యజమాని వాపోయాడు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించాడు.
శంకుస్థాపనలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్
కడప సెవెన్‌రోడ్స్ : కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వాలు శంకుస్థాపనలకే పరిమితం చేశాయని, ఇంకా జాప్యం చేస్తే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడప పర్యటనలో భాగంగా ఆమె కలెక్టర్ శ్రీధర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత పాలకుల నిర్వాకంతో స్టీల్ ప్లాంటు నిర్మాణం ‘చెల్లి పెళ్లి జరగాలి మళ్లీమళ్లీ’ అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు. టెంకాయ కొట్టేందుకే ప్లాంటు నిర్మాణాన్ని పరిమితం చేశారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఆమె టెంకాయ కొట్టారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి స్టీల్ ప్లాంటు పూర్తి చేసేదన్నారు. 2014 నుంచి బీజేపీ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, ఇతర నేతలు పాల్గొన్నారు. కాగా, బుధవారం ఉదయం వైఎస్సార్ సమాధి వద్ద షర్మిల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment