విద్యార్థిని చితకబాదిన పీఈటీ
కమలాపురం : స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అను అనే విద్యార్థిని పీఈటీగా పని చేస్తున్న చంద్ర కళావతి చితక బాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 18వ తేదీన ఇంటర్మీడియట్ విద్యార్థులు అన్నం తిన్న తర్వాత అరటి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూసేందుకు కేర్‌టేకర్‌గా అను అనే విద్యార్థిని మరో ఉపాధ్యాయురాలు నియమించారు. అయితే అక్కడున్న పీఈటీ చంద్ర కళావతి నీకు ఇంటర్మీడియట్ విద్యార్థుల వద్ద ఏం పని ఉందని వీపు పై చితక బాదారు. అలాగే చెంప మీద కొట్టబోయారు. ఆ సమయంలో అను చేయి అడ్డం పెట్టడంతో గాజు తగులుకుని విద్యార్థిని చేతికి గాయమైంది. అలాగే చేయి కూడా నొప్పిగా ఉందని బాధిత విద్యార్థిని కన్నీటి పర్యంతమైంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు బ్రహ్మయ్య, గంగాదేవిలు బుధవారం పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. సోమవారం ఘటన జరిగితే మంగళవారం సాయంత్రం వరకు తమకు సమాచారం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పీఈటీకి కొట్టే బాధ్యత ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు. నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో చదువుతున్న చిన్న కుమార్తె గీతాంజలి బాత్ రూంలో జారి పడి చేయి విరిగిందని, అప్పుడు కూడా వారం రోజులకు సమాచారం ఇచ్చారని, అప్పుడు తాము హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్య సేవలు అందించామన్నారు. కాగా, పాఠశాలలో ఉన్న ఇద్దరు పీఈటీల మధ్య మనస్పర్థలే ఇందుకు కారణం అని విశ్వసనీయం సమాచారం. పేరేంట్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ ఇద్దరు పీఈటీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా డీసీఓకు వారిని సరెండర్ చేయాలన్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ తులశమ్మను వివరణ కోరగా విద్యార్థినిని కొట్టిన మాట వాస్తవమేనని, అయితే విద్యార్థిని చేయి అడ్డం పెట్టడం వలన చేతికి చిన్న గాయం అయిందన్నారు. అప్పుడే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామన్నారు. ఘర్షణకు కారణమైన ఇద్దరు పీఈటీలకు షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు.
ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment