హత్య కేసులో నిందితుల అరెస్టు
బద్వేలు అర్బన్ : సుమారు మూడు నెలల క్రితం జరిగిన ఓ ఘర్షణలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ఐదు రోజుల క్రితం మృతి చెందిన మంచాల వెంకటయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చాబోలు గ్రామానికి చెందిన మంచాల వెంకటయ్య (38) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. ఈయన చెల్లెలిని బద్వేలు మండలం అబ్బుసాహెబ్‌పేట గ్రామానికి చెందిన గొడుగునూరు క్రిష్ణయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే ఇరువురు మనస్పర్ధలతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే సమయంలో మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామానికి చెందిన చెప్పలి దినేష్ తల్లితో వెంకటయ్య చనువుగా ఉంటుండేవాడు క్రిష్ణయ్య ఈ విషయాన్ని తెలుసుకుని దినేష్‌కు సమాచారం చేరవేశాడు. దీంతో దినేష్ వెంకటయ్యపై కక్ష పెంచుకుని క్రిష్ణయ్య సహకారంతో వెంకటయ్యపై దాడి చేసేందుకు పథకం పన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన పట్టణంలోని హెచ్‌పీ పెట్రోలు బంకు సమీపంలో వెంకటయ్యపై ఇరువురు కలిసి దాడి చేశారు. తిరిగి 13వ తేదీన అబ్బుసాహెబ్‌పేట గ్రామానికి వెళ్లి వెంకటయ్యపై మళ్లీ దాడి చేసి కత్తితో పొడిచారు. అప్పట్లో ఈ విషయమై అదే నెల 15వ తేదీన అర్బన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తీవ్ర గాయాలపాలైన వెంకటయ్య నెల్లూరు, కడపలో చికిత్స చేయించుకుంటూ ఈ నెల 15న కడప రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే తన కుమారుడి మృతికి క్రిష్ణయ్య, దినేష్‌లే కారణమని మృతుని తండ్రి చిన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి కేసును హత్య కేసుగా మార్చుకుని నిందితులను పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్‌ఐ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పాత కక్షలే హత్యకు కారణం
వివరాలు వెల్లడించిన అర్బన్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment