No Headline
కడప ఎడ్యుకేషన్ : ఏ ప్రభుత్వ కార్యాలయమైనా అధికారికంగా రోజుకు 7 గంటలు పని చేస్తుంది. బ్యాంకులు సైతం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సేవలందిస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం రోజుకు 8 గంటలు పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయ్యవార్లు, విద్యార్థులు పాఠశాలల్లోనే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మండలానికో పాఠశాలను ఎంపిక చేసి వాటిలో కొత్త పనివేళలను అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. జిల్లావ్యాప్తంగా 36 ఉన్నత పాఠశాలల్లో ఈ పనివేళలు అమలులోకి రానున్నాయి.
పనివేళల పెంపు నష్టమా? లాభమా?
పాఠశాలల పనివేళలను సాయంత్రం పూట మరో గంట పెంచడం వల్ల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తోంది. పిల్లలను 8 గంటలపాటు పాఠశాలలో కోర్చోబెట్టడం ఆక్షేపనీయమని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. సాధారణంగా ఉన్నత పాఠశాలలకు గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు వస్తుంటారు. అన్ని గ్రామాలకు సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో పిల్లలు 5 గంటల వరకు పాఠశాలలోనే గడిపితే ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందంటున్నారు. ఒక్కో పీరియడ్ 45 నిమిషాల వంతున 8 పీరియడ్లను పెట్టడం వల్ల విద్యార్థులు మరింత అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రార్థన సమయాన్ని 15 నిమిషాల నుంచి 25 నిమిషాలకు పెంచడం కూడా అభ్యంతరకరమే.25 నిమిషాల పాటు పిల్లలను ఆరుబయట నిలబెట్టడం శ్రేయస్కరం కాదని మేధావులు చెబుతున్నారు.
ఉపాధ్యాయులకు రెట్టింపు భారం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకే పాఠశాల చేరుకోవాలంటే దూరాన్ని బట్టి ఇంటివద్ద 7 లేదా 8 గంటలకే బయలుదేరాలి. సాయంత్రం 5 వరకు బడిలోనే ఉంటే ఇంటికి చేరుకొనేసరికి రాత్రి 7 అవుతుంది. అంటే అయ్యవార్లు ప్రభుత్వ విధుల కోసమే రోజులో 10 నుంచి 12 గంటలు కేటాయించాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు ఇది కష్టకాలమే అని చెప్పవచ్చు. కొత్త ప్రభుత్వ తీరును ఇటీవల ఓ ఉపాధ్యాయుడు విశ్లేషిస్తూ తమ పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందని వ్యాఖ్యానించాడు. యాప్‌ల భారం తగ్గించకపోగా పాఠశాలల పనివేళలను పెంచడం ఉపాధ్యాయులకు మరింత ఇబ్బందికరంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వీరికి రావాల్సిన బకాయిల ఊసే ఎత్తలేదు.అలాగే జూలై నెలలో మాత్రమే ఒకటో తేదీన వేతనాలు అందాయి.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ ఒకటో తేదీన జీతాలు అందలేదు.కొత్త ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటిస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆ ఛాయలే కనిపించలేదు.కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే మిగిలిందని, ప్రస్తుతం పాఠశాలల పనివేళల పెంపును చూస్తుంటే అయ్యవార్ల సహనానికి సర్కారు పరీక్ష పెట్టినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాఠశాల పనివేళలను పెంచిన ప్రభుత్వం
పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో 36 హైస్కూళ్లు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment