హై..హై..వాసు!
సాక్షి ప్రతినిధి, కడప : కడప నగరంలో పోలీసు సైరన్ మోతలు అధికమయ్యాయి. అనధికార పెత్తనం ఎక్కువైంది. కార్పొరేషన్ యంత్రాంగం జీ..హుజూర్ అంటూ తలాడిస్తూ వెళుతున్నారు. జనరల్ ఫండ్ సైతం మేయర్, సంబంధిత కార్పొరేటర్‌కు తెలియకుండా మంజూరవుతోంది. పాలకమండలితో నిమిత్తం లేకుండా ఏకంగా భూమి పూజలు సైతం చేయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చుట్టూ తిరుగుతోంది. కలెక్టర్ వద్దకు వెళ్లడం విస్మరిస్తారేమో కానీ, ప్రభుత్వ అధికారులు ఠంఛన్‌గా వాసు వద్దకు వెళ్లి కన్పిస్తున్న వైనమిది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి ఎలాంటి అధికారిక హోదా లేదు. ఆయన వాహనం నగరంలో బయలుదేరిందంటే ముందు వైపు పోలీసు జీపు వచ్చి చేరుతోంది. సైరన్ వేసుకుంటూ వెళ్తుంటే ఆ వెనుకే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వాహనం తర్వాత అనుచరుల వాహనశ్రేణి వెళుతోంది. తుదకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్లినా పోలీసు జీపు సైరన్‌తో వెళ్తూ లేని ప్రొటోకాల్‌ను కల్పిస్తున్నారు. మొన్నటి వరకూ నిబంధనలను అనుసరించి వ్యవహరించే పోలీసు యంత్రాంగం జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. అధికారం ఉంది.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం.. మాకు అడ్డు చెప్పేదెవ్వరు అన్నట్లుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి శైలి కూడా ఉండిపోయిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
జీ.. హుజూర్ అంటున్న యంత్రాంగం..
ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యులు. ఆ వాస్తవాన్ని విస్మరించి అధికారులు ప్రవర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రభుత్వంలో భాగస్వామ్యులన్నట్టుగా పలువురు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ధోరణి ప్రధానంగా కార్పొరేషన్ యంత్రాంగంలో అధికంగా కనిపిస్తోంది. పాలక మండలితో నిమిత్తం లేకుండా జనరల్ ఫండ్ వెచ్చింపులో సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం కడపలోని 20వ డివిజన్‌లో విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి ప్రకాష్‌నగర్ వెళ్లే రహదారి ఏర్పాటుకు రూ.15లక్షలతో సీసీ రోడ్డు నిర్మించేందుకు భూమి పూజ చేశారు. ఈకార్యక్రమం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా చేపట్టారు. అసిస్టెంట్ కమిషనర్ రాకేష్, డీఈ వేణుగోపాల్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది దగ్గర ఉండి భూమి పూజ చేయించడం విశేషం. కాగా నగర పాలక మండలి నిధులతో చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణం గురించి స్థానిక కార్పొరేటర్, మేయర్ సురేష్‌బాబుకు కనీస సమాచారం లేదు. అదే విషయాన్ని కార్పొరేటర్ కమిషనర్ మనోజ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులరెడ్డితో భూమి పూజ ఏ హోదాతో చేయించారు? ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యులు అన్న వాస్తవాన్ని ఎందుకు విస్మరించారు? కార్పొరేటర్‌గా నా హక్కులు హరించడం సమంజసమా? ఇలాంటి ప్రశ్నలకు అధికారుల వద్ద ఎలాంటి జవాబు లేదు. కాగా, శ్రీనివాసులరెడ్డితో భూమి పూజ చేయించడం అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ స్వామిభక్తి ప్రదర్శించడమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి సంప్రదాయం ఇకపై కొనసాగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్న వాస్తవాన్ని యంత్రాంగం గ్రహించాల్సి ఉంది.
కడప నగరంలో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు
హోదా లేకపోయినా ప్రొటోకాల్
పాటిస్తున్న పోలీసులు
జనరల్ ఫండ్ రోడ్డు నిర్మాణానికి వాసుతో భూమి పూజ
మేయర్, కార్పొరేటర్‌కు కనీస
సమాచారం ఇవ్వని వైనం
Comments
Please login to add a commentAdd a comment