24న క్రీడాపోటీలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో ఈనెల 24వ తేదీన ఇషా ఫౌండేషన్ గ్రామోత్సవ వేడుకల్లో భాగంగా పురుషుల వాలీబాల్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ కె. జగన్నాథరెడ్డి తెలిపారు. పోటీల్లో విజేతలకు నగదు ప్రోత్సాహకరాలు అందించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు డీఎస్‌ఏ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
పదోతరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువును ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ వరకు పెంచిందని జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని, అదే విధంగా రెండు పర్యాయాలు పరీక్ష రుసుం చెల్లించేందుకు తేదీలను కూడా మార్చిందన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 26వ తేదీలోగా పాఠశాల లాగిన్ www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా చెల్లించి ఇతర పత్రాలను పొందుపరచాలని డీఈఓ సూచించారు.
ఉపాధి నిధులు వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
వీరబల్లి : ఉపాధి హామీ పథకం నిధులు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఫార్మర్స్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ రాజశేఖర్ రాజు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులు దాదాపు పదివేల కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉందన్నారు. అందులో నుంచి పదిశాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. రైతులు విత్తనం నాటినప్పటి నుంచి కోతదశ వరకు వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుందని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఆలోచించి రైతులకు ఉపయోగపడే పనులకు ఉపాధి నిధులు ఖర్చుచేస్తే వారికి మేలు జరుగుతుందని తెలిపారు.
24న సాహిత్యం సదస్సు
కడప కల్చరల్ : యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెల సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా 138వ సదస్సును ఈ నెల 24వ తేది ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. ఈ సదస్సులో ‘మధురాంతకం రాజారాం జీవితం– సాహిత్యం’ అనే అంశంపై కడప ప్రభుత్వ పురుషుల కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు డాక్టర్ కె.ఎన్.సుందరేశ్వరరావు ప్రసంగిస్తారన్నారు.
వైవీయూ పీజీ సెమిస్టర్
పరీక్షలు ప్రారంభం
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయ ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ సెమిస్టర్ల పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ ఆవరణలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయంలో నిర్వహిస్తున్న పరీక్షలను వైవీయూ వీసీ ఆచార్య కె.కృష్ణారెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.ఎస్.వి.కృష్ణారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాల్ టికెట్లను వారు పరిశీలించారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆచార్య కాత్యాయని మాట్లాడుతూ పరీక్షలు డిసెంబరు 4వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో సూపరింటెండెంట్లు డా.లక్ష్మీ ప్రసాద్, డా.మునికుమారి తదితరులు పాల్గొన్నారు.
పనివేళల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
రాయచోటి అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల పనివేళల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ అన్నమ య్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంకం శివారెడ్డి, పి.మధుసూదన, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడిమాల మురళి డిమాండ్ చేశారు. గురువారం జిల్లాలోని పలు మండలాల్లోని పాఠశాలలను సందర్శించి ఎస్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలన్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల పనివేళలను 5 గంటలకు ముగిస్తే పిల్లలు ఇంటికి చేరే సమయానికి చీకటి పడుతుందని వివరించారు. విద్యార్థుల భద్రత అంశంపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment