పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కూరగాయల మార్కెట్ నుంచి జెడ్పీ హైస్కూల్ చివరి వరకు గత కొన్నేళ్లుగా ఉన్న అక్రమ నిర్మాణాలను పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు శుక్రవారం తొలగించారు. ఇక్కడ దాదాపు 30 చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటుండేవారు. అయితే ఇటీవల కాలంలో సంబంధిత ప్రాంతాలలో సాయంత్రం వేళల్లో వ్యాపారులు ఇష్టానుసారంగా రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మూడు రోజుల క్రితం పోలీసు, మున్సిపల్ అధికారులు వ్యాపారులతో మాట్లాడి రాత్రి 9 గంటల తర్వాత ప్రజలకు ఇబ్బంది లేకుండా కూరగాయల అమ్మకాలు సాగించాలని సూచించారు. ఇదే సమయంలో ప్రహరీ ముందు ఉన్న దుకాణాల ద్వారా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోందని మున్సిపల్ అధికారులు దుకాణాలను తొలగించారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐలు సత్యనారాయణ, రవికుమార్, మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారి సతీష్, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment