కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వ భూమిని కారణం లేకుండా అడుగు కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే హక్కు రెవెన్యూ అధికారులకు లేదని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. కదిలే ప్రతి అధికారిక కాగితం ఎస్‌ఓపీ ప్రకారమే జరగాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, మండల తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూ ముల కేటాయింపులో రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంశాలను విస్మరించరాదన్నారు. ఎక్కడైనా అలసత్వం, దుర్వినియోగం తన దృష్టికి వస్తే సహించేది లేదన్నారు. వీఆర్వో నుంచి డీఆర్వో వరకు ఫైల్ రికార్డుల నిర్వహణ కచ్చితంగా జరగాలన్నారు. అధికారులు మారినా రికార్డుల నిర్వహణ మాత్రం మారకూడదన్నారు. ఎక్కడైనా రికార్డులు లేవనే సమాధానం వస్తే ఆ అధికారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల స్థాయిలో ప్రతి గ్రామ భౌగోళిక, సామాజిక అంశాలపై తహసీల్దార్లకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు.డిసెంబరు 1వ తేది నుంచి ప్రతి కార్యాలయంలో ఈ–ఆఫీసు నిర్వహణ సక్రమంగా జరగాలని సూచించారు. అన్ని సచివాలయాల పరిధిలోప్రభుత్వ సేవల కోసం వచ్చే వినతులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలన్నారు. వారానికి కనీసం మూడు గ్రామసభలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment