మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
ప్రొద్దుటూరు: సర్వే సర్టిఫికెట్‌లో ఏకంగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ చలానాలు, సర్టిఫికెట్లు తయారు చేసి మున్సిపాలిటీ ఆదాయానికి ఉద్యోగులే గండికొడుతున్న ఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లు, స్థలాలు తదితర ఆస్తుల రిజిస్ట్రేషన్ లావాదేవీలకు గతంలో డోర్ నంబరు వేసేవారు. ఇప్పుడు సర్వే నంబరు సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఈ కారణంగా మున్సిపాలిటీ పరిధిలోని రిటైర్డు అధ్యాపకుడు బద్వేలి బాలమునిరెడ్డి సర్వే సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. సాధారణంగా పట్టణ పౌరులు ఎవరైనా నేరుగా పౌరసేవా కేంద్రానికి వెళ్లి సర్వే కోసం దరఖాస్తు చేయవచ్చు. అయితే టౌన్ సర్వేయర్ కృష్ణ కిశోర్ మాత్రం తన అనుమతి లేనిదే ఎవ్వరు దరఖాస్తు చేయడానికి వచ్చినా అనుమతించ వద్దని సదరు ఉద్యోగులకు సూచించారు. ఈ కారణంగా సర్వే కోసం వస్తున్న ప్రజలు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి రూ.1000 చలానా మొత్తాన్ని టౌన్ సర్వేయర్ చేతికి ఇస్తున్నారు. అయితే సర్వే సర్టిఫికెట్ కోసం సర్వేయర్ రూ.5వేలు డిమాండ్ చేయడంతో బాల మునిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డికి ఫిర్యాదు చేశారు.
వైస్ చైర్మన్ ఆరా: ఈ విషయంపై మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి గురువారం మున్సిపల్ కార్యాలయ పరిధిలోని పౌర సేవా కేంద్రానికి వెళ్లి ఆరా తీశారు. అసలు బాల మునిరెడ్డి సర్వే కోసం దరఖాస్తు చేసినట్లు చలానా లేని విషయాన్ని ఆయన గుర్తించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వద్దకు పాతకోట బంగారు మునిరెడ్డితోపాటు మరో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా వెళ్లారు. రూ.5వేలు మామూలు అడగడమేమిటని వారు కమిషనర్‌ను ప్రశ్నించారు. బాలమునిరెడ్డి సర్వే కోసం కట్టిన చలానా చూపించాలని కమిషనర్ కోరారు. టౌన్ సర్వేయర్ ఇచ్చిన ఫైల్‌లోని చలానాతో పాటు తయారు చేసిన సర్వే సర్టిఫికెట్‌ను కమిషనర్ పరిశీలించారు. వైస్ చైర్మన్‌ల ఫిర్యాదు మేరకు ఆయన సదరు ఉద్యోగులను పిలిపించారు. ఒరిజనల్ చలానాలపై లోగో ఉంటుందని, ఇది ఫేక్ చలానా అని వారు తెలిపారు. సర్వే సర్టిఫికెట్‌లో ఉన్న సంతకం తనది కాదన్న విషయాన్ని మున్సిపల్ కమిషనర్ అప్పటికే గుర్తించారు. వాస్తవానికి సర్వే కోసం ప్రతి రోజు మున్సిపల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకునేవారు ఉంటారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కేవలం 32 మంది మాత్రమే చలానా చెల్లించినట్లు ఆన్‌లైన్‌లో నమోదైనట్లు తెలిసింది. ఈ ప్రకారం ఉద్యోగులు పెద్ద మొత్తంలో ఫేక్ చలానాలను తయారు చేసి సొమ్ము చేసుకోవడంతోపాటు మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ ఎ.మల్లికార్జున, టౌన్ సర్వేయర్ కృష్ణ కిశోర్‌కు మెమో జారీ చేశారు.
నాకు సంబంధం లేదు
ఫేక్ చలానాతో తనకు సంబంధం లేదని మున్సిపాలిటీలోని టౌన్ సర్వేయర్ కృష్ణ కిశోర్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు లిఖిత పూర్వకంగా శుక్రవారం సాయంత్రం సమాధానం ఇచ్చారు.
నకిలీ సర్వే సర్టిఫికెట్ల తయారీ
Comments
Please login to add a commentAdd a comment