జిల్లాలో స్థానికంగా పేరొందిన సంప్రదాయ ఆహార ఉత్పత్తులను ఊతమిచ్చే విధంగా బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, డీఆర్‌డీఏ, మెప్మా, హార్టికల్చర్,ఏపీఎంఐపీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానికంగా లభ్యమయ్యే సంప్రదాయ ఆహార ఉత్పత్తులను మార్కెటింగ్, బ్రాండింగ్ తీసుకురావడంతో రైతులకు సైతం ఆదాయం చేకూరుతుందని అన్నారు. జిల్లాలో ప్రాధాన్యం ఉన్న స్వీట్స్,కారాలు మిల్లెట్, ఊరగాయలు, పౌడర్లు, స్పైసెస్ వంటి ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ తీసుకురావాలని కోర్ టీం అధికారులను ఆదేశించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సహకారంతో వీటిని చేపట్టాలని సూచించారు. కడప అరిశ, పోరుమామిళ్ల ఊరగాయలు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు పసుపు, రాజుపాలెం, జమ్మలమడుగు(దేవగుడి) పాలకోవా, ప్రొద్దుటూరు తంగెడుపల్లి స్వీట్ ,పులివెందుల, వేముల మిల్లెట్స్ వంటి ఆహార పదారాల ప్రమాణాలు, నాణ్యతలను అధికారులు పరిశీలించి ఎలా తయారు చేస్తున్నారు? ఎలా ప్రాసెసింగ్ చేస్తున్నారు? ప్యాకింగ్ ఏ విధంగా చేస్తున్నారు వంటి అంశాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వంటకాలకు, ప్రాచుర్యం ఉన్న మాధవరం చీరలు వంటి వాటికి దశలవారీగా భౌగోళిక గుర్తింపు తీసుకురావాలన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ర్‌పైజెస్( పీఎంఎఫ్‌ఎంఈ )కింద ఆహార ఉత్పత్తులకు ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. సమావేశంలో ఏపీ ప్రాసెసింగ్ సొసైటీ మార్కెటింగ్ మేనేజర్ మారుతి, హార్టికల్చర్ డీడీ సుభాషిణి,ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద నాయక్, మెప్మా పీడీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment