‘ఏపీ ఎన్‌జీజీఏ’ సభ్యత్వ నమోదు
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో శుక్రవారం ఏపీ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్‌నేతలు నగర శాఖ పర్యవేక్షణలో ఉద్యోగులకు సభ్యత్వాన్ని కల్పించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ నగర అధ్యక్షులు కె.చిన్నయ్య, కార్యదర్శి శైలేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారులకు అన్నివేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు తిమ్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బాల పుల్లయ్య, నగర కోశాధికారి నాగార్జునరావు, ఉపాధ్యక్షులు బాదుల్లా, రాజు, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు
వేగంగా పూర్తి చేయాలి
పులివెందుల రూరల్: పులివెందుల పట్టణ పరిధిలోని మెగా లేఔట్‌లో నిర్మిస్తున్న గృహాలను వేగంగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలోని మెగా లేఔట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ డిఈ రమణారెడ్డి, డీఈసీ ఏజెన్సీ ప్రతినిధి శ్రీనివాస్‌లను ఫీల్డ్, ఆన్‌లైన్లలో ఇంటి నిర్మాణ దశలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాముడు, హౌసింగ్ సిబ్బంది, వార్డు అమినిటీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పెండింగ్ బిల్లులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఈ హౌసింగ్ రామసురా రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
రాయలసీమలోని సంస్థలను అమరావతికి తరలించరాదు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాయలసీమలో ఉన్న సంస్థలను అమరావతికి తరలించరాదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సీపీ) రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి, లోకయుక్త, మానవ హక్కుల కమిషన్, ఇక్కడే ఉంచిన విధంగా ఏపీజీబీ, ఇతర సంస్థలను రాజధాని అమరావతికి తరలించటం లేదని చెప్పాలన్నారు. కార్యక్రమంలో, ఆర్‌సీపీ నగర కార్యదర్శి, మగ్బుల్‌బాషా, మడగలం ప్రసాద్, పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
చాపాడు: పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యను బోధించాలని జిల్లా విద్యాధికారి మీనాక్షి అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. అక్కడి సౌకర్యాలు, విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రణాళికా బద్ధంగా చదువు చెప్పాలన్నారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరాలంటే పాఠశాల విద్య ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 వంశీకృష్ణ, కస్తూర్భా స్పెషలాఫీసర్ నాగలక్ష్మీ, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment