డబ్బు ఎవరు చెల్లిస్తారు?
కడప సెవెన్‌రోడ్స్: రీ సర్వే రాళ్లపై ఉన్న వైఎస్‌ఆర్, జగనన్న భూ రక్ష–2020 అనే అక్షరాలు చెరిపేసేందుకు అయ్యే ఖర్చును అధికారులు తమపై మోపుతున్నారంటూ జిల్లాలోని పలువురు సర్వేయర్లు వాపోతున్నారు. సర్వే రాళ్లపై అక్షరాలు చెరిపివేసే ఒక్కో స్టోన్ బ్రషింగ్ యంత్రం రూ. 8 వేలుపైగానే అవుతోందని, ఆ డబ్బు తమకు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం తాము అడ్డదారులు తొక్కలేమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంతటి పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరిపి ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం అధికారులను అడగ్గా పని పూర్తి చేసిన తర్వాత చెల్లిస్తామనడం పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు.
వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో బ్రిటీషు వారు భూముల రీ సర్వే అండ్ రీ సెటిల్‌మెంట్ నిర్వహించారు. ప్రతి 30 ఏళ్లకోమారు రీ సర్వే జరగాల్సి ఉంటుంది. అలా జరగకపోవడం వల్ల అనేక భూ వివాదాలు తలెత్తాయి. న్యాయస్థానాల్లో ఇందుకు సంబంధించిన సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో మొదటి దశలో 86 గ్రామాల్లో 98,478.83 ఎకరాల్లో రీ సర్వే నిర్వహించారు. రెండోవిడతలో 99 గ్రామాల్లో 132442.40 ఎకరాలు, మూడోదశలో 97 గ్రామాల్లో 225356.17 ఎకరాల్లో రీ సర్వే జరిపారు. ఇలా మొత్తం 282 గ్రామాల్లో 4,56,277 ఎకరాలను రీ సర్వే నిర్వహించి రాళ్లు పాతారు. భూ సరిహద్దు రాళ్లపై చెక్కిన వైఎస్‌ఆర్ జగనన్న భూ రక్ష–2020 పేర్లపై నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్ కో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్షరాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ విడుదల చేయకపోవడం క్షేత్ర స్థాయి సర్వే సిబ్బందిలో అనుమానాలకు కారణమైంది.
సర్వే రాళ్లపై అక్షరాల
తొలగింపు ఖర్చుపై సర్వేయర్లు
ఇవన్నీ అపోహాలు మాత్రమే
జిల్లాలో ఇప్పటికి 25 వేల రాళ్లపై అక్షరాలు తొలగించాం. డిసెంబరు 31 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక్కో రాయిపై ఉన్న అక్షరాలను తొలగించేందుకు ప్రభుత్వం రూ. 15 చొప్పున ఇస్తుంది. సీసీఎల్‌ఏ ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. డబ్బులు ఇవ్వరనేది అపోహ మాత్రమే.
– మురళీకృష్ణ, జిల్లా సర్వే అండ్
ల్యాండ్ రికార్డ్స్ అధికారి, కడప
Comments
Please login to add a commentAdd a comment