రహదారుల అభివృద్ధికి వినతి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని రహదారులను అభివృద్ధి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి వినతిపత్రమిచ్చారు. జాతీయ రహదారి 716పైన ఉన్న భాకరాపేట నుంచి బద్వేలు (ఎన్‌హెచ్ 67), పోరుమామిళ్ల (ఎన్‌హెచ్ 167)మీదుగా ప్రకాశం జిల్లాలోని బెస్తవారిపేట (ఎన్‌హెచ్ 544డి) వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ఉన్నతీకరించాలని కోరారు. రేణిగుంట నుంచి ముద్దనూరు వరకు గల ఎన్‌హెచ్ 716 ఎంతో కీలకమైందని తెలిపారు. కోడూ రు, రాజంపేట, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, చిలంకూరు ద్వారా ముద్దనూరుకు వెళుతుందన్నారు. ఈ రహదారి వెంట అనేక శ్లాబ్ ఇండస్ట్రీస్ తో పాటు భారతి, జువారి, ఐసీఎల్ వంటి సిమెంటు కర్మాగారాలు, ఆర్టీపీపీ ఉన్నాయని వివరించారు. ఈ రహదారిపై ట్రాఫిక్ అధికంగా ఉంటుందన్నారు. వాణిజ్య సరుకులను రవాణా చేసే వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయని తెలిపారు. దీంతో ఈ రహదారిపై తరుచూ ప్రమా దాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల కడప నుంచి ముద్దనూరు వరకు ఉన్న రహదారిని ఫోర్‌లేన్ రోడ్డుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కడప నుంచి రేణిగుంట వరకు 130 కిలోమీటర్ల మేర ఉన్న రహదారిని ఫోర్‌లేన్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇక మిగిలి ఉన్న ముద్దనూరు–కడప (ఎన్‌హెచ్ 716)ను ఫోర్‌లేన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ రహదారులను అభివృద్ధి చేస్తే నెలకు రూ. 3 కోట్లు టోల్ రూపంలో వస్తుందని తెలిపారు.
వనిపెంట మీదుగా హైవే విస్తరణ పనులు చేపట్టాలి
ఎన్‌హెచ్ 167 మైదుకూరు నుంచి పోరుమామిళ్ల వెళుతోందన్నారు. గతేడాది సర్వే కూడా నిర్వహించారని పేర్కొన్నారు. మైదుకూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వనిపెంట గ్రామం ఉంటుందన్నారు. ఈ జాతీయ రహదారి వనిపెంట గ్రామం మధ్య నుంచి వెళుతోందన్నారు. ఫలితంగా పలు కుటుంబాలు చిన్నచిన్న షాపులు, దుకాణాలు రహదారికి ఇరువైపులా పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్నఫలంగా ఈ జాతీయ రహదారిని వనిపెంట గ్రామంలో నుంచి కాకుండా బైపాస్‌లో వెళ్లేలా నిర్ణయించారన్నారు. బైపాస్ రహదారి వల్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. పలు గ్రామాల ప్రజలు హైవే నిర్మాణానికి తమభూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితులను గమనించి గ్రామ ప్రజలు కోరుతున్న విధానంగా వనిపెంటలో నుంచే జాతీయరహదారిని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
భాకరాపేట నుంచి బెస్తవారిపేట రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలి
కడప–ముద్దనూరు మధ్య నాలుగులేన్ల రహదారి నిర్మించాలి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి వినతిపత్రమిచ్చిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment