ఇదేం రాజకీయం...?
టాస్క్‌ఫోర్స్ : ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని.. కష్టనష్టాలకోర్చి, కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు కనుమరుగవుతున్నారు. నిన్నగాక, మొన్న పార్టీలోకి వచ్చిన వారిని అందలమెక్కిస్తున్న కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి రాజకీయాలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల టీడీపీ నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డిపై చిన్నచౌక్‌లో అదే పార్టీకి చెందిన నాయకులు దాడిచేశారు. ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడి ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగిందని అప్పట్లో పత్రికలు, మీడియా కోడై కూశాయి. ఆ ఆరోపణలను ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఖండించడమేగాక, రిమ్స్‌లో చికిత్స పొందుతున్న శివకొండారెడ్డిని పరామర్శించారు. తాజాగా శివకొండారెడ్డిపై దాడి కేసులో ఎ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే మాధవి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పరిచయం చేయడంపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా టీడీపీలో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న తమను ప్రోత్సహించి అధినేతతో పరిచయం చేయించిన దాఖలాలు ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకెళ్లిన వ్యక్తి గత ఐదేళ్లలో ఎక్కడైనా టీడీపీ జెండా పట్టుకున్నాడా? ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడా? పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కార్యక్రమాలేమిటి? అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే మెప్పు కోసం సొంత పార్టీ నేతపై దాడి చేయడమే అర్హత అవుతుందా...ఇదేం న్యాయమని నిలదీస్తున్నారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
నగర అధ్యక్షుడిపై
దాడి చేసిన వ్యక్తికి అందలం
మండిపడుతున్న టీడీపీ శ్రేణులు
Comments
Please login to add a commentAdd a comment