ప్రజల నెత్తిన రూ.6 వేల కోట్ల గుదిబండ
కమలాపురం : విద్యుత్తు బిల్లులు పెంచనంటూ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించి ప్రజల నెత్తిన రూ.6వేల కోట్ల గుదిబండ మోపారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తు బిల్లుల పెంపును నిరసిస్తూ ఈ నెల 27న జిల్లా కేంద్రంలో తలపెట్టిన ధర్నాకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. 2014లో దొంగ హామిలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. అవే హామీలతో మళ్లీ 2024లో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నారు.., తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆరుమాసాలు కాకమునుపే రూ.6వేల కోట్ల భారం మోపారన్నారు. వచ్చే నెల మరో రూ.9 వేల కోట్లు బాదుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచినట్లే పెంచి, మూడు లక్షల మంది పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల స్క్రీనింగ్ కోసం 40 మందికి ఒక అధికారిని నియమించడం చూస్తుంటే 10 లక్షల మంది పింఛన్లు తొలగించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, సానుభూతి పరుల పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేరుకు, ప్రచారానికి మాత్రమే అన్న క్యాంటీన్లు అని చెప్పి.. ఒక్క సిలిండర్ ఇచ్చి ఊరుకున్నారని, చాలా మందికి డబ్బులు రావడంలేదని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ అమలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. జగనన్న హయాంలో ప్రతి నెలా ఒక పథకం ప్రజలకు చేరేదని, ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, గంగాధర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, చెన్న కేశవరెడ్డి, సుధా కొండారెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, గఫార్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, శరత్‌బాబు, దేవదానం, జెట్టి నగేష్, జావీద్, జిలానీ, ఖాజా హుసేన్, గౌస్‌మున్నా, సుదర్శన్‌రెడ్డి, సురేష్, సుబ్బన్న పాల్గొన్నారు.
27న విద్యుత్తు బిల్లుల పెంపునకు నిరసనగా ధర్నా
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment