రైతులతో చర్చించి..భూముల ధర నిర్ణయిస్తాం
వేంపల్లె/ఎర్రగుంట్ల/వీరనాయనపల్లి : రైతులతో చర్చించిన తర్వాతే అవార్డు ప్రకటించి భూముల ధర నిర్ణయిస్తామని వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. యర్రగుంట్ల, వేంపల్లె, వీరనాయునిపల్లె గ్రామాల్లో జాతీయ రాహదారి–440 నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులతో ఆమె బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యర్రగుంట్ల, పోట్లదుర్తి, వై.కోడూరు, పెద్దనపాడు, హనుమనుగుత్తి గ్రామాల్లో 101 ఎకరాల భూమి జాతీయ రహదారికి అవసరమవుతుందన్నారు. నిబంధనల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇస్తామన్నారు. రైతులు మాట్లాడుతూ నష్టపరిహారం విషయం తమకు అనుకూలంగా లేకపోతే రాజీ కాలేమన్నారు. రోడ్డుకు అనుకుని ఉన్న భూముల ధర ప్రస్తుతం కోట్ల రూపాయలు ఉందని, అనుకూల ధర ఇస్తే భూములిస్తామని తెలిపారు.
● వేంపల్లె స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భూములు కోల్పోయే రైతులు, లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వేంపల్లె పరిధిలో ఎకరా రూ.3 కోట్లు పలుకుతోందని, అందుకు అనుగుణంగా నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు జేసీని కోరారు. జేసీ మాట్లాడుతూ వేంపల్లె మండలంలోని 42.85ఎకరాల భూమిని 208 మందితో సేకరించినట్లు చెప్పారు. నిబంధనల మేరకు ఎకరాకు రూ.15 లక్షల పరిహారం కేటాయించామన్నారు రైతులు అడిగిన పరిహారం విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు. ఎన్‌హెచ్ యాక్ట్ ప్రకారం నష్ట పరిహారం ఫైనల్ చేసి లబ్ధిదారులకు అవార్డు ప్రకటించడం జరుగుతుందన్నారు. భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ నుంచి మూడేళ్ల ముందు వరకు జరిగిన ప్రతి ట్రాన్సలేషన్ పరిశీలించి ఎక్కువ ఉన్న 50 శాతం వాటిని తీసుకొని యావరేజ్ విలువ లెక్కగడతారన్నారు.
● వీరపునాయునిపల్లె డిగ్రీ కళాశాలలో రైతులతో జరిగిన సమావేశంలో అదితి సింగ్ మాట్లాడుతూ భూమిలో బోరు, బావులకు, చీనీ, నిమ్మ చెట్లకు ప్రత్యేకంగా నిధులు చెలిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు గ్రామ సభలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ చిన్నయ్య, నేషనల్ హైవే స్పెషల్ కలెక్టర్ వెంకటపతి, తహసీల్దార్లు హరినాథరెడ్డి, లక్ష్మిదేవి, శోభన్‌బాబు, రెవెన్యూ అధికారులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
రైతులతో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్
Comments
Please login to add a commentAdd a comment