క్లుప్తంగా
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : బైక్ మరమ్మతులు చేసుకుని వెళ్తుండగా అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలపరిధిలోని పి. బోమ్మేపల్లి గ్రామంలోని తండాకు చెందిన మూడే నారాయణ నాయక్(34) జమ్మలమడుగుకు వచ్చారు. బైక్ మరమ్మతు చేయించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో జమ్మలమడుగు పరిధిలోని రోజా టవర్స్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బద్వేల్ మున్సిపల్
వైస్ చైర్మన్ అరెస్టు
మైదుకూరు : బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగొల్ల గోపాలస్వామిని అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద ప్రసాద్ తెలిపారు. డీఎస్పీ తెలిపిన మేరకు.. గోపవరం మండలం ఎల్లారెడ్డి పేటకు చెందిన మేడిమెల సుశీల భర్త రత్నం 2018లో మృతి చెందాడు. అయితే అతను బతికి ఉన్నట్టు ఫోర్జరీ ఆధార్ సృష్టించి అతని పేరుతో ఉన్న చెన్నంరెడ్డిపల్లె పొలం సర్వే నంబర్ 1754/2లోని 1.02 ఎకరాల పొలాన్ని గోపాలస్వామి, డ్రైవర్ లక్ష్మీనారాయణ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ విషయంపై రత్నం భార్య మేడిమెల సుశీల ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బుధవారం ఎర్రగొల్ల గోపాలస్వామిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ వివరించారు.
జలాశయంలోకి దూకి చేనేత కార్మికుడి ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ (మైలవరం) : కుటుంబం కోసం చేసిన అప్పులు ఏలా తీర్చలో తెలియ మనస్తాపం చెందిన ఓ వ్యక్తి మైలవరం జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జరిగింది. పట్టణ ఎస్‌ఐ కల్పన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఊసవాండ్ల పెద్ద వెంకటేశ్(40) చేనేత కార్మికుడిగా పని చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తానని భార్య సుమలతకు చెప్పి వెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. బుధవారం మైలవరం జలాశయంలో మృత దేహం కనిపించడంతో గత ఈతగాళ్లతో వెలికితీయగా.. గూడెంచెరువు గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ కల్పన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment