పెద్దతిప్పసముద్రం మండల మీట్ నిర్వహించండి
బి.కొత్తకోట : అధికారుల ఏకపక్ష ధోరణి, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం, అభివృద్ధిని కాలరాసే విధంగా సాగుతున్న చర్యలపై పెద్దతిప్పసముద్రం ఎంపీపీ మొహమూద్ హైకోర్టును ఆశ్రయించగా అధికారులకు చెంపపట్టు లాంటి తీర్పు ఇచ్చింది. పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి వారంలోగా మండల పరిషత్ సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభివృద్దిని అడ్డుకోవడమే కాక మండల పరిషత్ సమావేశాలను జరగనివ్వకుండా అడ్డుపడుతూ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీటీఎం మండల పరిషత్ సమావేశ నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించారు.
వారంలో జరపండి :
పెద్దతిప్పసముద్రం మండల పరిషత్ సమావేశాన్ని ఈ ఆగష్టు ఏడున నిర్వహిస్తున్నట్టు అధికారులు సర్కులర్ జారీ చేశారు. సమావేశానికి పై హాలులో ఎంపీపీ, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఈ సమావేశం జరగనివ్వకుండా కూటమి నాయకులు అడ్డుపడి శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. దీనిపై ఎంపీపీ హైకోర్టును ఆశ్రయించారు. సమావేశం జరగకుండా అడ్డుపడిన ఘటనలకు సంబంధించిన వివరాలు, అధికారుల తీరుపై ఆధారాలను సమర్పించారు. హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇస్తూ నిబంధనల మేరకు వారంలోగా సమావేశం నిర్వహించాలని, శాంతిభద్రతల సమస్య లేకుండా సుహృద్భావ వాతావరణంలో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎంపీపీ, ఎంపీటీసీలు బుధవారం ఎంపీడీఓ అబ్దుల్‌కలాం అజాద్‌కు వినతిపత్రం అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి సమస్యలు లేకుండా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని కోరారు.
ఎంపీపీ అనుమతి లేకనే..
హైకోర్టు వారంలోగా సమావేశం నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు బుధవారం అందగా అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా మండలమీట్ జరపాలంటే ఎంపీపీ ఇచ్చే తేది, అనుమతి పొందాక సర్కులర్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులకు సమాచారం ఇవ్వాలి. అయితే ఎంపీపీ మొహమూద్ అనుమతి లేకుండానే అధికారులు సమావేశ నిర్వహణకు నిర్ణయించి ఈనెల 11న సర్కులర్ జారీ చేశారు. గురువారం సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వారంలోగా నిర్వహించాలని
హైకోర్టు ఆదేశాలు
శాంతిభద్రతలపై
కోర్టుకు ఆధారాల సమర్పణ
ఎంపీపీ అనుమతి లేకుండానే..
అధికారుల అత్యుత్సాహంతో
నేడు మండల మీట్
Comments
Please login to add a commentAdd a comment