రిమ్స్ అభివృద్ధి అందరి బాధ్యత
కడప అర్బన్: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్య విభాగాధిపతులకు సూచించారు. బుధవారం రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడి సెమినార్ హాల్‌లో వైద్య విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వేలాది మంది ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిని, మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయనీ, అందులో భాగంగానే అధునాతన సదుపాయాలతో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్స్ ఆసుపత్రి, మానసిక వైద్యశాలలు ప్రజలకు అందుబాటు లోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. మరో 5–6 నెలల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించే మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. అత్యంత విలువైన, అధునాతన వైద్యపరికరాలను వైద్య విభాగాధిపతులు కేవలం వైద్యం వరకే పరిమితం కాకుండా ఆయా విభాగాల్లో పరికరాల నిర్వహణ, యాజమాన్యంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే ప్రతి పేషెంట్ 100శాతం సంతృప్తికరంగా ఇంటికి వెళ్లేలా వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశానికి ముందుగా జిజిహెచ్‌లోని అన్ని విభాగాల్లో అవసరమైన వసతులు, సదుపాయాలు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది తదితర అన్ని వివరాలను అయా వైద్య విభాగాధిపతులను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల సరైన వసతులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, ఏపీవివిపీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ హిమదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, అడిషనల్ డిఎంఈ, ప్రిన్సిపాల్ ఏ. సురేఖ, ఆర్‌ఎంఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఆర్‌ఎంఓలు రాజేశ్వరి, సునీత, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ బాలాంజనేయులు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్‌లో హెచ్‌ఓడీల సమావేశంలోకలెక్టర్ శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment