కిక్కే.. కిక్కు!
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: మద్యం విక్రయాల ద్వారా వచ్చే సొమ్మే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. వీలైనంత ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రభుత్వం మరిన్ని బార్లు, లిక్కరు షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తాజాగా జిల్లాలో రెండు బార్లు, ఒక ప్రీమియం లిక్కర్ స్టోర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా లిక్కర్‌పై కమిషన్ సరిపోక తలలు పట్టుకుంటుంటే.. ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం మరిన్ని బార్లు ఏర్పాటు చేసి తమను బలి చేస్తోందని వైన్‌షాప్, బార్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
బార్.. బేజార్..
జిల్లాలో ప్రస్తుతం 28 బార్లు ఉన్నాయి. గతంలో ప్రభుత్వమే లిక్కర్ షాపులను నిర్వహించింది. అప్పట్లో రాత్రి 8 గంటలకు మద్యం దుకాణాలు మూసి వేయడంతో ఆ తరువాత బార్లకు మంచి వ్యాపారం జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కంటే ఎక్కువగా ప్రైవేట్ మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించింది. వీటి ద్వారా రాత్రి 10 గంటల వరకు విక్రయాల అనుమతులు ఇచ్చారు. దీంతో బార్ల వ్యాపారం దెబ్బతింది. ఫలితంగా చాలా మంది బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు వ్యాపారాన్ని లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆదాయం పొందడమే లక్ష్యంగా ప్రభుత్వం తాజాగా మరో రెండు బార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై బార్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ప్రీమియం లిక్కర్ స్టోర్....
జిల్లాలో కొత్తగా ఒక ప్రీమియర్ లిక్కర్ స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రీమియం స్టోర్ దరఖాస్తుదారుడు నాన్ రిఫండబుల్‌గా రూ. 15 లక్షలు డీడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆలాగే స్టోర్ దక్కించుకున్న వారు లైసెన్స్ కింద రూ. కోటి చెల్లించాలి. లైసెన్స్ వచ్చిన తరువాత 4 వేల చదరపు అడుగుల్లో స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో రూ.1200లకు పైగా లిక్కర్ , రూ.400 పైగా ఉన్న బీర్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. మద్యం ఏరులా పారుతున్న ప్రస్తుత పరిస్థితులో ప్రీమియం లిక్కర్ సేల్స్ కష్టమన్న భావన వ్యాపార వర్గాల్లో నెలకొంది. కాగా జిల్లా కేంద్రమైన కడపలో ప్రీమియం లిక్కర్ స్టోర్‌తో పాటు ఒక బార్‌ను, ఎర్రగుంట్లలో మరో బార్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు.
జిల్లాలో మరో రెండు బార్లు, ఒక ప్రీమియం స్టోర్‌కు నోటిఫికేషన్
ఇప్పటికే వ్యాపారాలు లేక తలలు పట్టుకుంటున్న వైన్‌షాప్, బార్ యజమానులు
Comments
Please login to add a commentAdd a comment