శక్తి స్వరూపిణి.. సర్వ మంగళకారిణి
బ్రహ్మంగారిమఠంలో కొలువుదీరిన ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగు బంగారంగా నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. శక్తిస్వరూపిణి, సర్వ మంగళకారిణిగా ప్రసిద్ధి చెందారు. ఈశ్వరీదేవి మఠంలో ఈ నెల 22 నుంచి అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చరిత్ర, ఉత్సవాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో వెలసిన వీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి పార్వతీదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె 1703లో స్వస్తిశ్రీ స్వభాను నామ సంవత్సరంలో జన్మించారు. కాలజ్ఞాన ప్రభోధకర్త శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మనవరాలు ఈశ్వరీదేవి. బ్రహ్మంగారి రెండో కుమారుడైన గోవిందస్వామి, గిరియమ్మ దంపతుల పెద్ద కుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచే సంస్కృతం, తెలుగు భాషలపై పాండిత్యం సంపాదించారు.
12 ఏళ్ల వయసులోనే..
ఒక రోజు గోవిందస్వామి శయ్యపై పరుండి, తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా మూడు రోజులున్నారు. పిలిచినా పలకలేదు. చనిపోయారేమోనని భావించి ఆయన భార్య గిరియమ్మ, బంధుమిత్రులు దుఃఖించుట ప్రారంభించారు. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్న ఈశ్వరీదేవి వచ్చి.. చింతించే పనిలేదని వారికి చెప్పారు. నాయన పరమాత్మతో ఆత్మను లీనం చేశారని తెలిపారు. వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ‘ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రాహ్మణే నమః’ అనే బీజాక్షరీ మంత్రాన్ని జపించారు. వెంటనే గోవింద స్వామి లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని చూసిన జనం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈశ్వరీదేవి సామాన్య మనిషి కాదని, మహిమాన్వితురాలని గుర్తించారు. తండ్రినే గురువుగా భావించి.. ఆయన ద్వారా మంత్రోపదేశం నేర్చుకున్నారు.
14 ఏళ్లు తపస్సు చేసి..
బ్రహ్మంగారిమఠానికి సమీపాన ఉన్న నల్లమల అడవుల గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞాన వాక్సిద్ధి పొందారు. వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్నసాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేయుటకు సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. లోక కల్యాణార్థం స్వీయ కల్యాణాన్ని త్యజించి బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు.
ఎన్నో మహిమలు
ఈశ్వరీదేవి ఎన్నో లీలలు ప్రత్యక్షంగా చూపించారని భక్తులు చెప్పుకొంటూ ఉంటారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో ఈశ్వరీదేవి చేతి ప్రసాదాలు నిరాకరించి, పరిహాసం ఆడిన ఓ వర్తకుడు పిచ్చివాడిగా మారారని చెబుతారు. వినుకొండ వాసుల కోరిక మేరకు.. మంచి నీటితో దీపాలు వెలిగించారని, కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి నయం చేశారని, ఓ బ్రాహ్మణుడి చంపల వ్యాధిని తన కర స్పర్శతో పోగొట్టారని భక్తులు చెబుతారు.
మఠాధీశులై.. నిత్య పూజలు
తండ్రి గోవిందస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశురాలై నిత్య పూజ కార్యక్రమాలు, ఆరాధన గురుపూజోత్సవాలు ఈశ్వరీదేవి నిర్వహిస్తుండేవారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. దీంతో ఆమె శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. వీరబ్రహ్మేంద్రస్వాములను ఈశ్వరీదేవి పిలిచిన ‘జేజినాయన’ అనే పిలుపు లోక ప్రసిద్ధమై.. నాటి నుంచి భక్తజనులు ఆయనను ‘జేజినాయన’ అని కొలుస్తున్నారు. 1789లో ఆమె చిన్నమఠంలో సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు.
ఆరాధనోత్సవాలు
ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ ఉత్సవాలు నిర్వహించనున్నారు. 24న మార్గశిర బహుళ నవమిన సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కనుక ప్రధాన వేడుక నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు.
దర్శనీయ స్థలాలు
బ్రహ్మంగారిమఠంలో దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి. వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, కాలజ్ఞాన ప్రతులు, నివాసగృహం, స్వామి తవ్విన బావి, పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ, కక్కయ్య మఠం, పోలేరమ్మ గుడి, రామాలయం(భజన మందిరం), అచలా నందస్వామి ఆశ్రమం, మద్దాయత్రి విశ్వకర్మ వంశవృక్ష దేవాలయం, ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహ, బ్రహ్మంసాగర్, ముడుమాలలోని సిద్దయ్య మఠం, అక్కంపేటలోని నాగలింగేశ్వరస్వామి ఆలయం (విభూదిలింగం).
భక్తుల కొంగు బంగారంగా ఈశ్వరీదేవి
22 నుంచి ఆరాధన గురుపూజ మహోత్సవాలు
ఘనంగా ఏర్పాట్లు
అమ్మవారి ఆరాధనోత్సవాలకు భక్తుల సహకారంతో మఠం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.
– శ్రీ వీరశివకుమారస్వామి, మఠాధిపతి, ఈశ్వరీదేవిమఠం
Comments
Please login to add a commentAdd a comment